సేవా పుష్పాలతో తయారు చేసిన వేంకటేశ్వర స్వామివారి చిత్రపటం, తిరుమలలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో స్వామి వారి చిత్రపటాలు, అలంకరణ వస్తువులు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార వైభోగం చెప్పనలవి కాదు. స్వామి వారి అలంకారంలో పుష్పాలదే అగ్రస్థానం. తిరుమలేశుని మూల మూర్తికి ఉదయం లేచింది మొదలు రాత్రి పవళింపు సేవ వరకు నిత్యం సాగే పూజాదికాల్లో అనేక రకాల పుష్పాలు వాడతారు. స్వామి సేవకు ఉపయోగించిన పవిత్రమైన పుష్పాలను పూజారుల చేతుల నుంచి అందుకోవడమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది పూజకు ఉపయోగించిన పుష్పాలు స్వామి వారి రూపంలో ఉంటే భక్తుల తన్మయత్వం అంతా ఇంతా కాదు. ఇదే తలంపుతో టీటీడీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తలపెట్టాయి.
చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
గతేడాది జనవరిలో ‘ఎండు పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వామి వారి పుష్పాలతో దేవతా మూర్తులు, పలు రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధన ప్రాంగణంలోని స్కిల్ డెవలప్‌మెంట్ యూనిట్‌లో 350 మందికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చారు. ఎండబెట్టిన పూలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో కూడిన చిత్రపటాలు, వివిధ రకాల వస్తువుల తయారీతో జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు. కోవిడ్ కారణంగా భర్త చనిపోయిన వారు, ఉపాధి కోల్పోయిన వారు, టీ బంకుల్లో, ఇళ్లల్లో పనులు చేసుకునే వారు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు.
దైవత్వం ఉట్టిపడేలా కళారూపాలు
ఉద్యాన వర్సిటీతో చేసుకున్న ఒప్పందం మేరకు స్వామివారి సేవలో ఉపయోగించే పూలను టీటీడీ సరఫరా చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వాటిని ఎండబెట్టి, ఫొటో పేపర్, కాన్వాస్‌లపై దైవత్వం ఉట్టిపడేలా వివిధ రూపాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, పద్మావతి, ఒంటిమెట్టలోని సీతారాములు, శ్రీకృష్ణుడు, వకుళామాత వంటి దేవతామూర్తుల చిత్రపటాలను తీర్చిదిద్దుతున్నారు. డాలర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, లాకెట్లు, పెన్‌స్టాండ్‌లు వంటి వాటిని తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నారు. కొందరు రూ.30 వేల వరకు కూడా సంపాదిస్తున్నారు.
నెలకు రూ.40 లక్షల ఉత్పత్తుల తయారీ
ఇక్కడ తయారైన వస్తువులను తిరుమలతో పాటు టీటీడీకీ అనుబంధంగా ఉన్న స్వామి వారి ఆలయాల వద్ద విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల విలువైన ఉత్పత్తులు తయారవుతుండగా, రూ.60 లక్షల స్థాయికి పెంచుతున్నారు. ఆన్‌లైన్‌లో కూడా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారికి అలంకరించే 3 నుంచి 5 అడుగుల నిలువెత్తు పూలదండలను ఎండబెట్టి ఫ్రేమ్ కట్టి భక్తులకు అందించే ఆలోచన చేస్తున్నారు.
దీనిని పూర్తిస్థాయి పరిశ్రమగా నిలబెట్టేందుకు ప్రత్యేక భవనం నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలంటూ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి యూనివర్సిటీకి వినతులు వస్తున్నాయి. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ప్రవాసాంధ్రులు కూడా ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మరో వైపు ఎండుపూలతో తయారు చేసే వస్తువుల జీవిత కాలం పెంచేందుకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రొ.రాచకుంట నాగరాజు పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. ఎండబెట్టిన పూలను వాటి సహజసిద్ధమైన రంగు కోల్పోకుండా పౌడర్ రూపంలో మార్చడం పైనా అధ్యయనం చేస్తున్నారు.
కుటుంబానికి లోటులేకుండా ఉంది
నా భర్త ఏడాది క్రితం కోవిడ్‌తో చనిపోయారు. ఇద్దరు పిల్లలు, అత్త పోషణ నాపై పడింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇక్కడ శిక్షణ పొంది నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. కుటుంబానికి లోటు లేకుండా ఉంది.
–ఎం.శివకుమారి, హరిపురం కాలనీ, తిరుపతి
అప్పులన్నీ తీర్చేశా
నా భర్త సిమెంట్ పనికి వెళ్తారు. నెలలో 15–20 రోజులే పని. రోజుకు 450 సంపాదించే వారు. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. స్వామి వారి ఫొటో ఫ్రేమ్స్ తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత నెలకు రూ.10–12వేలు సంపాదిస్తున్నా. అప్పులన్నీ తీర్చేశా.
–కడపల దివ్యలత, అన్నమయ్య నగర్, తిరుపతి
మంచి స్పందన లభిస్తోంది
టీటీడీతో కలిసి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎండుపూల ఉత్పత్తుల ప్రాజెక్టుకు మంచి స్పందన లభిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ పొందిన మహిళల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.
–డాక్టర్. టి.జానకిరామ్, వైస్‌చాన్సలర్, ఉద్యాన వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment