![E-Stamp Duty System coming soon Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/7/REGISTRATION-1.jpg.webp?itok=R8O6k-v9)
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను ప్రజలు మరింత సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేందుకు స్టాంప్ వెండర్లు, గ్రామ–వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్‌లైన్‌లో చార్జీలను కట్టించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తొలుత కొందరు స్టాంప్ వెండర్ల వద్ద ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 71 మంది స్టాంప్ వెండర్లకు అవకాశం ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్ (ఏసీసీ) అనుమతిని వారికి మంజూరు చేశారు. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకు చలానాలు కాకుండా స్టాంప్ వెండర్ల వద్ద ఆన్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కట్టేయవచ్చు. వాటి రశీదులను (స్లిప్‌లు) వారికిస్తారు. వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తారు.
ఎస్‌హెచ్‌సీఐ ద్వారా అమలు
ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ సంస్థతో అనుసంధానమై ఉంటాయి. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో విడిగా ఒప్పందం కుదుర్చుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను కట్టించుకునేందుకు వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనుంది.
ఏరోజు కట్టించుకున్న చార్జీల మొత్తాన్ని ఆ రోజే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీనివల్ల వినియోగదారులు చలానాలు కట్టేందుకు డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే నకిలీ చలానాల సమస్య కూడా ఉండదు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో అధికారికంగా స్టాంప్ వెండర్ల వద్ద స్టాంప్ డ్యూటీ కట్టే సౌలభ్యం అందుబాటులోకి రానున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు.
మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చెల్లింపులు
మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి స్టాంప్ వెండర్ల కంటే ముందు వాటిలోనే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు. సాంకేతిక అంశాల కారణంగా తర్వాత దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్టాంప్ డ్యూటీని కట్టించుకునే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆసక్తిగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. వినియోగదారులు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందడానికి వీలుగా ఈ–స్టాంప్ డ్యూటీ విధానాన్ని తీసుకువస్తున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment