సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది.
ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది.
గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే.
కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా?
ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు
వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది.
ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే అంతలో ఎంఎల్‌సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది.
ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే..
వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్‌డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్‌సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది.
ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్‌సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్‌టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్‌ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది.
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
Published Sun, Feb 26 2023 2:58 AM | Last Updated on Sun, Feb 26 2023 7:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment