సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ దినపత్రిక అసత్యాలతో దుష్ప్రచారం సాగిస్తోందని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘విద్యా కానుక బూట్లు కాళ్లకు పట్టవు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని ఖండించింది. ‘ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేముల కోట జడ్పీ ఉన్నత పాఠశాలను ఈనెల 15న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. 7వ తరగతికి వెళ్లి విద్యార్థులు ధరించిన షూలను పరిశీలించారు.
కొంత మంది విద్యార్థులు షూ ధరించలేదు. ఇందుకు వారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోవడంతో వారికి ఇచ్చిన షూలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. జి.సందీప్ కుమార్, కె.శివపార్వతి ఇళ్ల వద్ద ఉన్న వారి షూలను పరిశీలించారు. అవి ఆ విద్యార్థులకు సరిగ్గా సరిపోయాయి. ఎలాంటి డ్యామేజీ కూడా లేదు. దీంతో ఆ షూలను విద్యార్థులకు తొడిగించారు. ప్రతి రోజూ పిల్లలతో షూ ధరింపచేసి స్కూళ్లకు పంపాలని వారి తలిదండ్రులకు సూచించారు.
ఆ తర్వాత ఆ పిల్లలను తన వెంట స్కూలుకు తీసుకెళ్లారు. అక్కడి టీచర్లతో సమావేశమై 100 రోజుల పాటు అలవాటు చేస్తే విద్యార్థులు తప్పకుండా షూ వేసుకొని వస్తారని సూచించారు. ప్రకాశం జిల్లాలో 21 వేల మంది విద్యార్థులకు సంబంధించిన షూ లను ఎక్స్‌ఛేంజ్ చేసి అందించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని స్కూళ్ల హెచ్ఎంల నుంచి విద్యార్థులందరికీ షూలు సరిపోయాయని డిక్లరేషన్ కూడా తీసుకుంది. ఈ వాస్తవాలను విస్మరించి, విద్యా కానుక బూట్లు విద్యార్థులకు పట్టవు అంటూ ‘ఈనాడు’ అసత్యాలతో వార్త ప్రచురించడం దారుణం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment