( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న ‘జగనన్న విద్యాకానుక’పై ఏడుపుగొట్టు కథనాలతో ఈనాడు మరోసారి తన నైజాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగా విద్యాకానుక గుత్తేదార్లకేనంటూ ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ‘ఫ్యాక్ట్ చెక్’లో వెల్లడైంది. గతంలోనూ ఇదే తరహా కథనాలు ప్రచురించడం తెలిసిందే.
ఈనాడు ఆరోపణ: ఈసారి బూట్లపై రూ.14 అధికం
వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక జత బూట్లు, 2 జతల సాక్సుల కొనుగోళ్లకు ఆమోదించిన వ్యయం రూ.200. అయితే రివర్స్ టెండర్లతో రూ.187.48కే టెండర్ ఖరారు చేశారు. ఇది ప్రభుత్వం ఆమోదించిన ధర కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం
ఆరోపణ: బ్యాగ్‌పై సగటున రూ.92 అధికం
వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక్కో బ్యాగు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆమోదించిన వ్యయం రూ.265.50. మొదటిసారి టెండర్లలో కాంట్రాక్టర్లు 30 శాతం అధికంగా రేటు కోట్ చేయడంతో వాటిని రద్దు చేసి రెండోసారి పిలిచారు. రివర్స్ టెండర్ల ద్వారా నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో బ్యాగును రూ.272.92 చొప్పున ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇది కేవలం 2.43 శాతం అధికం. బ్యాగు నాణ్యత పెరగడంతో ప్రభుత్వం అనుమతించిన గరిష్ట పరిమితి యూనిట్ వ్యయం 5 శాతం మించకుండా టెండర్లు ఖరారు చేశారు.
ఆరోపణ: చిరిగిన బ్యాగ్‌ల సరఫరాపై చర్యలు శూన్యం
వాస్తవం: జగనన్న విద్యాకానుక 3వ విడతలో చిరిగిన, పాడైన బ్యాగులకు సంబంధించి జేవీకే యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అలాంటి బ్యాగులు రీప్లేస్ చేయని సరఫరాదారులకు ఆ మేరకు చెల్లింపులు నిలిపివేశారు.
ఆరోపణ: ముగ్గురు పాత కాంట్రాక్టర్లే
వాస్తవం: టెండర్ నిబంధనల ప్రకారం అనుమతించారు. కొత్త కాంట్రాక్టర్లు కూడా పాల్గొనేలా అవకాశం కల్పిస్తూ బ్యాగులు, బూట్లకు సంబంధించి పెద్ద టెండర్లను ఐదు రీజియన్లుగా విభజించి పిలిచారు. దీనివల్ల ఏకపక్ష ఆధిపత్యం ఉండదు.
ఆరోపణ: బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి.
వాస్తవం: ప్రభుత్వం అనుమతించిన మేరకు మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా కేవలం ఒక్క శాతం పెరుగుదలతో మాత్రమే టెండర్లను ఖరారు చేశారు.
ఆరోపణ: విద్యార్థులు తగ్గినా రూ.155.84 కోట్లు అదనపు భారం
వాస్తవం: యూడైస్ గణాంకాల ఆధారంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 శాతం పెరుగుదల లెక్కించి టెండర్లు ఆహ్వానిస్తుంటారు. డెలివరీ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు మాత్రం విద్యార్థుల యథార్థ సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం 39,96,064 మంది విద్యార్థులను పరిగణనలోకి తీసుకుని సరఫరా షెడ్యూల్ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతించిన విధంగా 5శాతానికి మించకుండా టెండర్లు ఖరారు చేశారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన వ్యయం కంటే తక్కువ బడ్జెట్‌లోనే విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment