ఒకటీరెండూ కాదు! 54 ప్రభుత్వ సంస్థలు. కొన్నిటిని కావాల్సిన వారికి అమ్మేశారు. మరికొన్నింటి ఆస్తుల్ని నచ్చినవారికి ఇచ్చేసి.. వాటిని మూసేశారు. అక్కడితో ఆగలేదు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రయివేటీకరణ... ఓ విజయగాధ’’ అంటూ పుస్తకం వేసుకున్నారు నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు. తన ఘనతకు జబ్బలు చరుచుకుంటూ... ‘‘మారకపోతే ముందుకెళ్లటం అసాధ్యం. ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాగే ఉంటే కష్టం’’ అని ముందుమాట కూడా రాశారు.
ఇక నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడైతే... ఇలాంటి పుస్తకం తెచ్చినందుకు తన జన్మ ధన్యమైందంటూ ఉప్పొంగిపోయారు. ప్రయివేటీకరణ అనే పదానికి పేటెంట్ తీసుకుని, దానికోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వ సంస్థల్ని ఊచకోత కోసిన చంద్రబాబు ఇప్పుడేమంటున్నారో తెలుసా? విశాఖ స్టీల్ ప్రయివేటీకరణను అడ్డుకోవటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి లేదట!!. ఇక చంద్రబాబు ఏ కంపెనీని అమ్మేసినా... మూసేసినా శెబాషంటూ కితాబిచ్చిన ‘ఈనాడు’ ఇప్పుడేమంటోందో తెలుసా? తెలంగాణకు ఉన్నపాటి శ్రద్ధయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదట!!. ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం చేతగాదని, ప్రయివేటీకరణను గట్టిగా వ్యతిరేకించడానికి కూడా భయపడుతున్నారని.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు మాత్రం సత్తా చాటారని రంగస్థల పద్యాలు రాసేశారు రామోజీ!!. ఈ దుర్మార్గపు కుట్రల వెనక నిజానిజాలివిగో...
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నది తమ విధానమని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోంది. దీనికోసం ఉద్యమిస్తున్న అక్కడి కార్మిక సోదరులకు వివిధ సందర్భాల్లో మద్దతు కూడా తెలుపుతోంది. అంతేకాదు! మొదటి నుంచీ దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... దీనికోసం 2021 ఫిబ్రవరి 6న, 2022 మార్చి 9న నేరుగా ప్రధానిని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాశారు.
ఏదో అడిగినట్లు కాకుండా... స్టీల్ ప్లాంటుకు ఉన్న సమస్యలేంటి? దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? అనేవి లేఖలో సూచించారు. ప్లాంటుకు ఉన్న విలువైన భూముల్ని ప్లాంటు గనక విక్రయించుకోగలిగితే రుణం సమస్య తీరుతుందని, సొంత ముడి ఇనుము గనులు కేటాయిస్తే మిగిలిన ప్లాంట్ల మాదిరిగానే లాభదాయకత సమస్య ఉండదని వివరంగా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు! ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినపుడల్లా విశాఖ ఉక్కును ప్రస్తావిస్తూనే వస్తున్నారు. అది ఒకసంస్థ మాత్రమే కాదని... తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని కూడా కేంద్రానికి చెబుతూ వస్తున్నారు.
మరోవంక చంద్రబాబు నాయుడు మాత్రం తను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకించే ప్రయత్నమే చేయలేదు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ప్రకటనా చేయలేదు. పైపెచ్చు ఇపుడు బిడ్డింగ్‌లో పాల్గొంటామంటూ తెలంగాణ సర్కారు తన ఆలోచనను బయటపెట్టడంతో... ఇదే సాకుగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌పై విషం చిమ్మటం మొదలెట్టారు.
ఆయనకు జతకలిశాడు ఆయన ఆప్తమిత్రుడు రామోజీరావు. ‘‘ఉక్కు సంకల్పం మనకేదీ?’’ అంటూ ఓ కథనాన్ని వండేశారు. అసలు ఇలాంటి కథనాలు వండే ముందు అందులో సాధ్యాసాధ్యాలు... బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఉన్న అవకాశాలు ఇవన్నీ చూడాలి కదా? అదేమీ లేకుండా తెలంగాణ సర్కారు తన ఆలోచన బయటపెట్టగానే... ఆంధ్రకేదీ ఉక్కు సంకల్పం? అంటూ విషపు చుక్కలు విసిరేయటమేనా? అసలు వైఎస్ జగన్ ప్రభుత్వమంటే ఎందుకంత కక్ష రామోజీరావు గారూ? ఎందుకంత అక్కసు.. అసూయ?
ఏపీ, తెలంగాణ, సింగరేణిలకు బిడ్డింగ్‌లో నో చాన్స్!
వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్టాలకూ ప్రభుత్వ రంగ సంస్థలకూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, 51 శాతానికన్నా ఎక్కువ ప్రభుత్వ వాటా ఉన్న సంస్థలు గానీ... డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా విక్రయించే సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనకూడదని నిషేధం విధించింది. అలా పాల్గొనే అర్హత వీటికి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ప్రభుత్వ వాటా 51 శాతానికన్నా ఎక్కువ ఉన్న సింగరేణి సంస్థకు కూడా ఈ అర్హత లేదు.
ఈ నిబంధనలను సడలిస్తూ ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం గనక ప్రత్యేకంగా అనుమతి ఇస్తే... వారికి బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హత వస్తుంది. బహుశా... తాము ప్రయత్నించినా కేంద్రం తమను అనుమతించలేదని చెప్పుకోవటం తెలంగాణ ప్రభుత్వ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ అర్హత గురించి ‘ఈనాడు’కు తెలియదనుకోవాలా? తెలిసి కూడా... వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తెలంగాణతో పోల్చి.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి కుట్ర చేశారనుకోవాలా? రెండోదే నిజం. ఏదో ఒకరకంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారమే ధ్యేయంగా సాగుతున్న రామోజీరావు... ఇలాగైనా తన చంద్రబాబుకు సాయపడాలనుకున్నారు. అందుకే ఈ దుర్మార్గపు రాతకలు దిగారు.
కడప స్టీల్ ప్లాంటును పట్టించుకోలేదేం?
నాడు– నేడు ప్రైవేటీకరణను వ్యతిరేకించింది జగన్ ఒక్కరే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో... కడపలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ ఐదేళ్లు అధికారంలో ఉన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. కనీసం కేంద్రాన్ని గట్టిగా అడగలేదు. ఎందుకు అడగటం లేదంటూ చంద్రబాబును ‘ఈనాడు’ ప్రశ్నించలేదు కూడా!!. ఐదేళ్లలో కడప స్టీల్ ప్లాంటు దిశగా ఒక్క అడుగూ పడకపోయినా... ‘ఈనాడు’ ఏనాడూ ఒక్క అక్షరం కూడా రాయలేదు.
2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలుమార్లు కేంద్రాన్ని అభ్యర్థించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... కేంద్ర నిరాసక్తతను గమనించి ప్రయివేటు సంస్థలను రప్పించే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రభుత్వ రంగంలో కుదరనపుడు ప్రయివేటు రంగంలోనైనా భారీ ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం ప్రయత్నాలు ఫలించి... దేశంలో అగ్రగామి సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ముందుకొచ్చింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ ఈ ప్లాంటుకు సీఎం సమక్షంలో శంకుస్థాపన చేశారు. అదీ చిత్తశుద్ధి అంటే.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి ముఖ్యమంత్రి లేఖలు రాయటం... అభ్యర్థించటం ఒకవైపు జరుగుతుండగానే... మరోవైపు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సైతం గళమెత్తుతూ వస్తున్నారు. మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రతిపక్షంలో బీరాలు పలికారని, అదికారంలోకి వచ్చాక చేష్టలుడిగారని ‘ఈనాడు’ విషం కక్కడమే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం.
ఇదీ... బాబు గారి ప్రయివేటీకరణ లోగుట్టు
విలువైన ప్రభుత్వ సంస్థల్ని, వాటి ఆస్తుల్ని తన వారికి కట్టబెట్టేయాలని ముందే పథకం వేసిన చంద్రబాబు... 1996లో తాను సీఎం అయ్యాక పద్ధతి ప్రకారం దాన్ని అమల్లోకి తెచ్చారు. అందుకు రామోజీరావు శక్తివంచన లేకుండా సహకరించారు. మూసేయాలనుకున్న సంస్థలకు ముందుగా... నష్టాల ఊబిలో కూరుకుపోయాయంటూ ముద్ర వేసేవారు. ‘ఈనాడు’లో ఆయా సంస్థలు విపరీతమైన నష్టాల్లో ఉన్నాయని, వాటిని పోషించటం వృథా అంటూ వరసగా కథనాలు రాయించేశారు.
ఒక కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలన్న సూత్రాన్ని రామోజీ–బాబు పక్కాక్కా అమలు చేశారు. అందులో భాగంగానే నిజాం షుగర్స్‌కు చెందిన 8 యూనిట్ల ఆస్తులను కారుచౌకగా ప్రయివేటు పరం చేసేశారు. డెల్టా షుగర్ మిల్‌తో పాటు ఇతర సహకార చక్కెర కర్మాగారాలను మూసేశారు. ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్‌ను ప్రైవేట్ పరం చేశారు, ఆల్విన్ వాచీలు, స్పిన్నింగ్ మిల్లులు, పేపర్ మిల్లులు వంటి 54 సంస్ధలను అందిన కాడికి అమ్మేశారు. ఇందులో కొన్నిటిని ప్రైవేటీకరించగా 22 సంస్ధలను మూసేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల్ని ‘వీఆర్‌ఎస్’ పేరిట ఇంటికి పంపేయటం ద్వారా రూ.1282 కోట్లను ఆదా చేసినట్లు గుడ్ గవర్నెన్స్ పుస్తకంలో చంద్రబాబు రాసుకున్నారంటే పరిస్థితిని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించి... వీఆర్‌ఎస్ పేరిట 89,000 మంది సింగరేణి ఉద్యోగులను ఇంటికి పంపేసినా ‘ఈనాడు’ దాన్ని వ్యతిరేకించలేదు. సరికదా పొగిడింది.
2004 నుంచి రెండోద ప్రయివేటీకరణలో మరో 68 సంస్ధల్ని తమ వారికి అప్పగించేందుకు చంద్రబాబు పథకం వేసి ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రెండో దశలో ఆర్టీసీతో పాటు, విద్యుత్ పంపిణీ సంస్ధల వంటివి ప్రయివేటీకరణ జాబితాలో ఉన్నాయి. అయితే 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఒడిపోవటంతో అవన్నీ బతికిపోయాయి. ఆ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా వైఎస్, రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో బాబు ప్రయివేటీకరణ ఘట్టానికి ఫుల్‌స్టాప్ పడింది.
07–02–2021న ప్రధానమంత్రి మోదీకి సీఎం జగన్ లేఖ
–ప్రత్యామ్నాయం చూడండి–ప్రైవేట్‌కు వద్దు
–విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
రాష్ట్రానికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆభరణం, దాన్ని కాపాడుకుటంటాం, సంస్థ పునురుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంట్ ఇది. 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉంది. సొంత గనులు లేకపోవడం..వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి. పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి. ప్లాంట్ తప్పనిసరిగా లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీల భారం ఉండదు..
09–03–2021న ప్రధానమంత్రి మోదీకి సీఎం జగన్ మరో లేఖ
మీ నిర్ణయం మార్చుకోండి–విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు
ప్రధాని మోదీకి సీఎం జగన్ మరో లేఖ
గత నెలలో నేను మీకు (ప్రధానమంత్రి) రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలన్నింటినీ వివరించాను. ఆర్దిక మంత్రి ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. మా ఆకాంక్షలు, సెంటిమెంట్..ప్లాంట్‌ను ప్రవేటీకరించకుండా ఉన్న మార్గాల గురించి మీకు మరో సారి వివరించడానికి అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలను వెంట తీసుకుని వస్తాను. త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ మరో మారు మీకు లేఖ రాస్తున్నాను.విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్‌కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
ఏది నిజం?: బాబే.. ప్రైవేటు మాస్టర్.. అంతా చేసింది ఆయనే.. ఒక్క ముక్క రాయని ఈనాడు
Published Wed, Apr 12 2023 3:55 AM | Last Updated on Wed, Apr 12 2023 1:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment