
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి–2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరీలో 18 ఓపెన్ ఇసుక రీచ్‌లకు ఇచ్చిన అనుమతులను మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను ఆ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆ 18 రీచ్‌ల్లో తవ్వకాలు జరపవచ్చని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ ఈ రీచ్‌లపై ఎన్జీటీ విధించిన జరిమానాపైనా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరీల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణ శాఖ పునఃసమీక్షించాలని కోర్టు సూచించిందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చోట్లా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో అర్థంలేని రాతలు రాయడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్‌పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని వెంకటరెడ్డి వివరించారు.