సాక్షి, అమరావతి: ఒక తప్పుడు ఆరోపణ చేస్తే దాని వెనకున్న నిజాలు బయటకొస్తాయనే భయం లేకుండా రామోజీరావు నిత్యం సిగ్గూఎగ్గూలేని రాతలు రాసూ్తనే ఉన్నారు. రోజూ ఆయన వండి వారుస్తున్న కల్పిత కథల్ని జనం విశ్వసించే రోజులు పోయాయని తెలుసుకోలేని మొద్దు నిద్రలో ఆయనున్నారు. ఎందుకంటే.. పేద విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పత్రిక ‘ఈనాడు’ విషం కక్కుతోంది.
ప్రభుత్వ పాఠశాలలపైన, ప్రభుత్వ విద్యా వ్యవస్థల మీద నిరంతరం బురద జల్లుతూ వాటి ప్రతిష్టను మసకబార్చేందుకు ఆపసోపాలు పడుతోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రోజుకో అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అదే నిజమని నమ్మించేందుకు నానాపాట్లు పడుతోంది.
ఇందులో భాగమే సోమవారం ప్రచురించిన ‘‘నాడు–నేడు.. నాణ్యతే లేదు చూడు’’.. కథనం. నిజానికి.. గత చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ విద్యను గాలికొదిలేసి.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల చదువు కోసం ఆస్తులను అమ్మే పరిస్థితులను కల్పించింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టింది.
‘నాడు–నేడు’తో మెరుగుపడుతున్న పాఠశాల విద్య..
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, ఇంగ్లిష్ డిక్షనరీ, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, గోరుముద్ద.. ఇలా అనేక సంస్కరణలను అమలుచేసి కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం అనుసరించేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రంగా పాఠశాలలను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడుతున్నాయి. అలాగే..
► మనబడి నాడు–నేడు 2020–21 మొదటిదశలో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్ల ఖర్చుతో పది మౌలిక సదుపాయాలు కల్పించారు.
► నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు–ట్యూబ్‌లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులకు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, వంట గది నిర్మాణం చేశారు.
► ఇక నాడు–నేడు రెండో దశలో (2022–23)లో రూ.8 వేల కోట్ల అంచనాతో 22,344 పాఠశాలలు, అన్ని జూనియర్ కాలేజీలు, ఫౌండేషన్ పాఠశాల (అంగన్‌వాడీ)ల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాల పాటు మరమ్మతులకు నోచుకోని వేల పాఠశాలలు నాడు–నేడుతో బాగుపడుతున్నాయి.
బాగున్న భవనాలకు మరమ్మతులు, శిథిలమైనవాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. రెండోదశలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులు చేసేందుకు ప్రభుత్వం సమర్ధవంతమైన విధానాలను అమలుచేస్తోంది. ఆయా స్కూళ్ల నిర్వహణకు నిధిని కూడా ఏర్పాటుచేసింది. నాణ్యతలేని పనులకు బాధ్యత ఎవరిదన్న అంశంలోనూ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది.
ప్రతి వస్తువూ వారంటీతో కొనుగోలు..
చాక్‌బోర్డుల నుంచి, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, తాగునీటి యంత్రాలు.. ప్రతి వస్తువును నిర్దిష్టమైన వారంటీతోనే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎక్కడ నాణ్యత దెబ్బతిన్నా వాటి స్థానంలో సంబంధిత కంపెనీనే కొత్తవి అమర్చేలా కచ్చితమైన ఒప్పందం చేసుకుంది. గ్యారంటీ, వారంటీ నిర్వహణలో ఆయా కంపెనీలన్నీ నిర్దిష్ట కాలపరిమితి వరకూ బాధ్యులుగా ఉన్నాయి.
► పాఠశాలల్లో కల్పించిన సదుపాయాల నిర్వహణ ఖర్చులకు, మొదటిదశలో చేపట్టిన పాఠశాలలకు, మూడో దశలో చేపట్టే పాఠశాలలకు మరమ్మతుల నిమిత్తం 2023–24లో రూ.329 కోట్ల నగదును పాఠశాల తల్లిదండ్రుల కమిటీలకు బదిలీచేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
► అంతేకాక.. ఎప్పటికప్పుడు స్కూళ్ల నిర్వహణ సమాచారాన్ని రియల్ టైమ్ పద్ధతిలో సేకరించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నారు.
పాడైతే కంపెనీలతోనే మరమ్మతులు..
ఇక సరఫరా చేసిన వస్తువులు, పరికరాలు ఐదేళ్ల వారంటీలో ఉన్నాయి కాబట్టి, చెడిపోయిన వాటిని ఆయా కంపెనీలే మరమ్మతులు చేస్తాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 18,802 నీటిశుద్ధి యంత్రాల మరమ్మతులకు వినతులు రాగా యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలే మరమ్మతులు పూర్తిచేశాయి. మొదటి దశలో పాఠశాలల్లో ఏర్పాటుచేసిన తాగునీటి శుద్ధియంత్రాల నిర్వహణ కోసం ఐఐటీ మద్రాస్ నిపుణుల సూచన మేరకు ఆటో టీడీఎస్ కంట్రోల్, బ్యాక్‌వాష్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) యంత్రాలను అన్ని పాఠశాలల్లోని నీటిశుద్ధి యంత్రాలకు ఏర్పాటుచేస్తున్నారు.
► ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లలో అవకతవకలు జరిగాయనడంలో వాస్తవంలేదు. విద్యార్థులకు బెంచీల సరఫరా కోసం టెండర్ల ద్వారా 5.10 లక్షల సరఫరాకు ఒప్పందం జరగ్గా, 3,88,727 బెంచీలు మాత్రమే విద్యాశాఖ తీసుకుంది.
► గ్రీన్ చాక్‌బోర్డుల విషయంలో కూడా మొదటి కంపెనీ అనుకున్న సమయానికి సరఫరా చేయలేకపోయింది.దీంతో రెండో కంపెనీ సకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించడంతో ఆ కంపెనీతో ఒప్పందం జరిగింది. సీలింగ్ ఫ్యాన్లు విషయంలోనూ కంపెనీ చేసిన పొరపాట్లకు పెనాల్టీలు వేసి ప్రభుత్వం వసూలుచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment