సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు షరతులు విధించింది. ఈ షరతులకు లోబడే సభ నిర్వహించాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘానికి తేల్చి చెప్పింది. ర్యాలీకి అనుమతినిచ్చే ప్రసక్తే లేదంది. సంఘం నిర్ణయించిన సెప్టెంబర్ 1న సభకు అనుమతించలేమని, మరో తేదీ చెప్పాలని ఆదేశించింది. ప్రైవేటు స్థలంలో సభకు షరతులు వర్తించవంటే కుదరదని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలంలోనైనా షరతులకు లోబడే సభ నిర్వహించాలని చెప్పింది.
ఛలో విజయవాడ పేరుతో ఉద్యోగ సంఘాలు ముద్రించిన కరపత్రంలో 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారని, ఇంత పెద్ద స్థాయిలో సమావేశానికి పిలుపునిచి్చనప్పుడు షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు సభలో పాల్గొనేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. షరతులను ఉల్లంఘించి సమావేశం నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటును పోలీసులకు ఇస్తామంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీపీఎస్‌ను రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్‌తో సెప్టెంబర్ 1న విజయవాడలో ర్యాలీ, బహిరంగ సభకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. 1000 మందితో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు అనుమతి కోరుతూ సంఘం కార్యదర్శి హుస్సేన్ పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో సంఘం ప్రైవేటు స్థలంలో సభకు పోలీసుల అనుమతి కోరింది.
అయితే పోలీసులు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో సంఘం కార్యదర్శి హుస్సేన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. ప్రైవేటు స్థలంలో సభకు అనుమతులు అవసరం లేదన్నారు. కేవలం 1,000 మందితో సభ నిర్వహిస్తామని, 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనరని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీపీఎస్ ఉద్యోగుల సంఘంలో 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు కరపత్రంలో ముద్రించారన్నారు.
శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉన్నందునే జింఖానా గ్రౌండ్స్‌లో సభకు అనుమతించలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ర్యాలీకి అనుమతినిచ్చేది లేదని చెప్పారు. సభ తాము విధించే షరతులకు లోబడే ఉండాల్సిందన్నారు. మరో తేదీని తెలియజేస్తే దానినిబట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
విద్యుత్ కార్మికుల ధర్నాకూ హైకోర్టు షరతులు
విద్యుత్ కార్మిక సంఘాల ధర్నాకు కూడా హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. సెలవు రోజుల్లో మాత్రమే ధర్నా చేయాలని, తాము నిర్దేశించిన సంఖ్యకు మించి ఉద్యోగులు పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ధర్నాలో పాల్గొనే ఉద్యోగులందరూ వారం ముందుగానే ఆధార్ కార్డులను పోలీసులకు సమర్పించాలని స్పష్టం చేసింది. రెండు గంటల్లో ధర్నా, నిరసన ముగించేలా ఆదేశాలిస్తామంది. ధర్నాను ఏ రోజున చేపడతారో నిర్ణయించి, తమకు చెప్పాలని నిర్వాహకులను ఆదేశించింది. దాని ఆధారంగా తగిన షరతులతో ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధనకు విజయవాడ ధర్నా చౌక్ లేదా జింఖానా గ్రౌండ్స్‌లో ధర్నా, నిరసన కార్యక్రమానికి అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పలు వామపక్ష విద్యుత్ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపిస్తూ.. తాము ధర్నా మాత్రమే చేస్తున్నామని, సమ్మెకు దిగడం లేదని చెప్పారు.
అందువల్ల ఎస్మా వర్తించదని తెలిపారు. ధర్నా వల్ల విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండబోదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. విద్యుత్ ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి వస్తారని, ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదన్నారు. అందువల్ల వీరి ధర్నా, నిరసనకు అనుమతులు ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment