సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మార్చి మొదటి వారంలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల విభాగాధిపతులను ఆదేశించింది. ఇప్పటికే కేటాయింపు ఎలా జరపాలనే దానిపై మార్గదర్శకాలు ఇచ్చి అందుకనుగుణంగా కేటాయింపుల జాబితాలు పంపాలని సూచించింది. ఇందుకు టైమ్ షెడ్యూల్‌ను కూడా నిర్దేశించింది. దీంతో..
► ఫిబ్రవరి 28లోపు జిల్లా, డివిజనల్ కార్యాలయాలు, పీఏఆర్ (ప్రొవిజినల్ అలొకేషన్ రేషియో–తాత్కాలిక కేటాయింపు నిష్పత్తి), పూర్తి జాబితాలను ఆయా శాఖలు పునర్వ్యవస్థీకరణ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతోపాటు సంబంధిత శాఖల కార్యదర్శుల ద్వారా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాల్సి వుంటుంది.
► ఆర్థికశాఖ మార్చి 3లోపు ఆ జాబితాలను పరిశీలించి తుది కేటాయింపు జాబితాలను సిద్ధంచేయాలి. అలాగే, మార్చి 7లోపు ఈ జాబితాలను ఖరారు చేసి తిరిగి ఆయా శాఖల కార్యదర్శులకు ఆర్థిక శాఖ పంపుతుంది.
► వీటిలో కార్యదర్శులు ఏమైనా మార్పులు సూచిస్తే వాటిని బట్టి చివరిగా మార్చి 11కల్లా ఆర్థిక శాఖ తుది కేటాయింపు జాబితాను ఆమోదిస్తుంది.
► ఆ తర్వాత కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ వెలువడే రోజునే ఉద్యోగుల కేటాయింపుపైనా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు జారీచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.
సర్వీస్ డెలివరీ యూనిట్ల కేటాయింపు ఇలా..
ఇక కొత్త జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ఏ నిష్పత్తి ప్రకారం సర్వీస్ డెలివరీ యూనిట్లు (అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు వంటివి) కేటాయించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియో, డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియోను ఏవిధంగా చేయాలో ఉదాహరణలతో సూచించింది. జిల్లా కార్యాలయాలను ఎలా చేయాలో వివరిస్తూ..
ఉదా : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోని మండలాలు, డివిజన్లు, జిల్లా మ్యాప్‌లను పరిశీలించి కొత్త జిల్లాల ప్రకారం ఏ మండలాలు, ఏ డివిజన్లు ఏ జిల్లా పరిధిలోకి వెళ్లాయో నిర్థారించి విభజించాలని సూచించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 3,130 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆ జిల్లా కొత్తగా కర్నూలు, నంద్యాల జిల్లాలుగా ఏర్పడుతుండడంతో వాటి పరిధిలోకి వచ్చే మండలాలు, డివిజన్ల ప్రకారం వాటిని విభజించినప్పుడు కర్నూలు జిల్లాకు 1,806, నంద్యాల జిల్లాకు 1,324 అంగన్‌వాడీ కేంద్రాలు వచ్చాయి. నిష్పత్తి ప్రకారం 57.70 శాతం కేంద్రాలు కర్నూలుకు, 42.30 శాతం నంద్యాల జిల్లాకు వెళ్తాయి. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ షాపుల వంటి సర్వీసెస్ డెలివరీ యూనిట్లన్నింటినీ విభజించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఉద్యోగుల కేటాయింపు పూర్తికి షెడ్యూల్
Published Tue, Mar 1 2022 5:48 AM | Last Updated on Tue, Mar 1 2022 11:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment