AP: బీటెక్‌ సీటు హాట్‌ కేకు | Engineering students interested studying AP colleges YS Jagan govt | Sakshi
Sakshi News home page

AP: బీటెక్‌ సీటు హాట్‌ కేకు

Published Fri, Sep 23 2022 3:43 AM | Last Updated on Fri, Sep 23 2022 7:40 AM

Engineering students interested studying AP colleges YS Jagan govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు హాట్‌కేకుల్లా భర్తీ అవుతున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలోని కాలేజీల్లో చదవడానికి ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్‌–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌)లో గురువారం తొలి విడత సీట్ల కేటాయింపులో 82% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటా ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపులో ఇదో రికార్డు. గత ఏడాదిలో కూడా తొలి విడతలోనే 75 శాతానికి పైగా భర్తీ అయ్యాయి.

ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. జగన్‌ సీఎం అయిన తర్వాత కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. ఏడాది ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ప్రముఖ పరిశ్రలతో కాలేజీలను అనుసంధానిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సీట్లు హాట్‌ కేకులే అయ్యాయి.

రాష్ట్రంలోని 248 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 1,11,864 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,615 సీట్లు మిగిలి ఉన్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ సి.నాగరాణి చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్‌లో 1,73,572 మంది అర్హత సాధించగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 1,01,318 మంది వెబ్‌ ఆప్షన్లకు అర్హత సాధించారు. వీరిలో 99,025 మంది ఆప్షన్లను నమోదుచేశారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను కేటాయించారు. స్పోర్ట్సులో 492, ఎన్‌సీసీలో 984 సీట్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) నుంచి మెరిట్‌ జాబితా అందిన అనంతరం ఆ సీట్లు కేటాయిస్తారు.

భారీగా కంప్యూటర్‌ సైన్సు సీట్లు
ఇంజనీరింగ్‌ సీట్లలో కంప్యూటర్‌ సైన్సు, తత్సంబంధిత సీట్లు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా కంప్యూటర్‌ సైన్సు కోర్సుల్లోనే అత్యధిక శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి. గతంలోకన్నా ఈసారి ఎక్కువ సీట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. సీఎస్‌ఈ, తత్సంబంధిత సీట్లు 41,991 భర్తీ కాగా అందులో సీఎస్‌ఈ సీట్లు 27,261 ఉన్నాయి. ఆ తరువాత ఈసీఈ, ఈఈఈలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తొలివిడతలోనే ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి.

 

బాబు హయాంలో సీట్ల భర్తీ అంతంతే
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్వీనర్‌ కోటా ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి విద్యార్ధుల నుంచి స్పందన పెద్దగా ఉండేది కాదు. విద్యార్థుల్లో చాలా మంది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపేవారు. జేఈఈ మెరిట్‌ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులో నిలిచి మంచి కాలేజీలో సీటు వచ్చినా, దానిని వదులుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు కాకుండా కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. చంద్రబాబు హయాంలో చివరి దశ కేటాయింపులు పూర్తయ్యాక కూడా కాలేజీల్లో దాదాపు 40 శాతం సీట్లు ఖాళీగా ఉండేవి. 2016లో 58 శాతం, 2017లో 60 శాతం, 2018లో 61 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కాలేజీల్లోనే చదవడానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు.


నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్‌
ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని యాజమాన్య కోటా అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతాయి. విద్యార్థులు కాలేజీలకు నేరుగా దరఖాస్తు చేయడానికి లేదా ఈ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు.

ఫార్మసీ సీట్ల భర్తీకి బ్రేకు
ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నా వాటికి బ్రేకు పడింది. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని నిలిపివేశారు. అనుమతుల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని ఫార్మసీ కౌన్సిల్‌ ఉన్నత విద్యాశాఖకు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్‌కు మరోసారి లేఖ రాసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement