కోపర్తిలో ‘వైఎస్సార్‌ ఈఎంసీ’ | Establishment Of Electronic Manufacturing Cluster In YSR District | Sakshi
Sakshi News home page

కోపర్తిలో ‘వైఎస్సార్‌ ఈఎంసీ’

Published Thu, Aug 27 2020 3:21 AM | Last Updated on Thu, Aug 27 2020 9:17 AM

Establishment Of Electronic Manufacturing Cluster In YSR District - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్‌ జిల్లా కోపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)’ని ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 ఎకరాల్లో ఈ క్లస్టర్‌ ఏర్పాటుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎంసీ–2 విధానం కింద ఎలక్ట్రానిక్‌ తయారీదారులను ఆకర్షించేందుకు రూ.730.50 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్‌ ఈఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికల్‌ వలవన్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడమే కాకుండా రూ.380.50 కోట్లు గ్రాంట్‌గా సమకూర్చనుంది. మిగిలిన రూ.350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, టెలికాం నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్, ఈ మొబిలిటీ ఉత్పత్తుల తయారీకి చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీఐఐసీ ఈ ఈఎంసీని అభివృద్ధి చేయనుంది. ఈ క్లస్టర్‌ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
   
తైవాన్‌ కంపెనీలు ఆసక్తి
కోవిడ్‌–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు భారత్‌లో తయారీ రంగ యూనిట్లు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన రెండు మొబైల్‌ తయారీ కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. యాపిల్‌ ఫోన్‌ తయారుచేసే తైవాన్‌ సంస్థ పెగాట్రాన్‌ కూడా కోపర్తిలో యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. అలాగే యాపిల్, రెడ్‌మీ వంటి ఫోన్లను తయారుచేసే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రంలో మరో రెండు యూనిట్ల ఏర్పాటును పరిశీలిస్తోంది. ఇందులో ఒక యూనిట్‌ను కోపర్తి ఈఎంసీలో ఏర్పాటుచేయాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. వీటితో పాటు పలు దేశీయ కంపెనీలు కూడా తమ యూనిట్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి వ్యక్తంచేస్తున్నాయి.

ఈఎంసీలో యూనిట్లకు అనేక రాయితీలు
కోపర్తి వైఎస్సార్‌ ఈఎంసీలో ఏర్పాటుచేసే యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పలు రాయితీలు అందించనుంది. విదేశీ సంస్థలతో పాటు దేశీయ సంస్థలను ఆకర్షించేందుకు ప్రత్యేక రాయితీలిచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తరుల్లో పేర్కొంది. అవి..

  •  ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లకు ఒకేచోట అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు, తక్కువ ధరకే భూమిని లీజుకు ఇవ్వనున్నారు. 
  • కంపెనీలు వారికి నచ్చినట్లుగా తక్షణం ఫ్యాక్టరీ నెలకొల్పుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. 
  •  యూనిట్లకు భూమిని తొలుత 33 ఏళ్లకు లీజుకిచ్చి దాన్ని 99 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. 
  •  కార్యకలాపాలు ప్రారంభించి విజయవంతంగా పదేళ్లు పూర్తిచేసుకున్న తర్వాత భూమిని పూర్తిగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. 
  • 100 శాతం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, రూ.4–4.5లకే యూనిట్‌  విద్యుత్, 20 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ, వడ్డీ రాయితీ, ఎనిమిదేళ్లపాటు ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లింపు, లాజిస్టిక్‌ సపోర్టు కింద ఐదేళ్లపాటు దేశీయ రవాణాలో ఏడాదికి రూ.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తారు. 
  • రూ.250 కోట్ల పెట్టుబడితో కనీసం 2,000 మందికి ఉపాధి కల్పించిన సంస్థకే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఐపీఎస్‌ పాలసీ కింద ఇచ్చే మెగా స్టేటస్‌ను కూడా ఇవ్వనున్నారు.
  •  ఈ పాలసీ కింద ఈఎంసీని అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించే బాధ్యతను ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్, ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
కోవిడ్‌–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు భారత్‌లో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని ఆకర్షించడానికి కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైఎస్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు భారత్‌లో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకువచ్చేలా ఆయా కంపెనీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement