క్వారీలపై కూటమి నేతల జులుం | Excavations have stalled in quarries across the state | Sakshi
Sakshi News home page

క్వారీలపై కూటమి నేతల జులుం

Published Thu, Jun 27 2024 4:20 AM | Last Updated on Thu, Jun 27 2024 5:37 AM

Excavations have stalled in quarries across the state

రాష్ట్రవ్యాప్తంగా క్వారీల్లో స్తంభించిన తవ్వకాలు 

తమ లెక్క తేల్చాకే క్వారీయింగ్‌ చేయాలని ఎమ్మెల్యేల హుకుం 

దీంతో 15 రోజులుగా ప్రభుత్వానికి మైనింగ్‌ రాయల్టీ బంద్‌  

తవ్వకాలు లేకపోవడంతో ఇబ్బందుల్లో రవాణా పరిశ్రమ 

ముడి సరుకులు లేక పలు పరిశ్రమలకు ఆటంకాలు 

మరోవైపు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ అక్రమ మైనింగ్‌ 

లోకేశ్‌ దత్తత గ్రామంలోనే అనధికారికంగా మట్టి తవ్వకాలు 

సాక్షి, అమరావతి: అధికార టీడీపీ కూటమి నేతల దౌర్జన్యపూరిత విధానాలతో రెండు వారాలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్వారీల్లో మైనింగ్‌ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ రూప­ంలో రావాల్సిన ఆదాయం నిల్చిపోవడంతో పాటు పలు పరిశ్రమలు, రవాణా రంగం ఇబ్బందుల్లో పడ్డాయి. ఇంకోపక్క టీడీపీ నేతలు పలు క్వారీల్లో అక్రమంగా మైనింగ్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మైనింగ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే డైరెక్టరేట్‌ కార్యాలయాన్నే 14 రోజులుగా మూసివేశారు. 

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సైతం తెరవకుండా సీజ్‌ చేశారు. ఏదో జరిగిపోయిందనే అనుమానంతో మైనింగ్‌ జరుగుతున్న క్వారీలను స్తంభింపజేయడంతోపాటు మైనింగ్‌ కార్యాలయాలను సైతం మూసివేసి అక్కడి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వినాలని అన్ని జిల్లాల మైనింగ్‌ డీడీలు, ఏడీలకు ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. 

ఇంకో పక్క కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు రకరకాల కారణాలతో క్వారీలపై విరుచుకుపడ్డారు. వారు క్వారీల వద్దకు వెళ్లి తవ్వకాలు నిలిపివేశారు. తాము చెప్పే వరకు క్వారీయింగ్‌ చేయకూడదని, క్వారీలు పని చేయాలంటే ముందుగా తమ సంగతి తేల్చాలని స్పష్టం చేశారు. దీంతో పక్కాగా అనుమతులు ఉన్న క్వారీల్లోనూ మైనింగ్‌ నిలిచిపోయింది. గ్రానైట్, రోడ్‌ మెటల్, క్వార్జ్, సున్నపురాయి వంటి అనేక క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయాయి.

శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్‌పై దెబ్బ 
శ్రీకాకుళం జిల్లా కీలక మంత్రి ఆదేశంతో గ్రానైట్‌ మైనింగ్‌ ఆగిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ జిల్లాలో వందకు పైగా ఉన్న గ్రానైట్‌ క్వారీలను అప్పటికప్పుడే స్తంభింపజేశారు. మైనింగ్‌ ఏడీ ద్వారానే తమ లెక్క తేలే వరకూ వాటిలో మైనింగ్‌ జరగక్కూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. గ్రానైట్‌ తవ్వకాలు నిలిచిపోవడంతో పాలిషింగ్‌ యూనిట్లకు ముడి సరుకు దొరక్క, అవి కూడా మూతపడుతున్నాయి. 

ఫలితంగా దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల రాయల్టీ కూడా ఆగిపోయింది. క్వారీలకు అనుబంధంగా పనిచేసే ట్రక్కులు, లారీలు, లాజిస్టిక్‌ వ్యాపారాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. వాటిల్లో పనిచేసే వేలాది మందికి కొద్ది రోజులుగా పని లేకుండాపోయింది. విశాఖ పోర్టు నుండి రోజుకు వంద నుండి రెండు వందల లారీల్లో గ్రానైట్‌ బ్లాక్స్, పాలిషింగ్‌ పలకలు ఎగుమతయ్యేవి. అవన్నీ ఇప్పుడు నిలిచిపోయాయి. 

అన్ని జిల్లాల్లోనూ స్థానికంగా ఉన్న క్వారీల యజమానులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. స్థానిక నేతలు, ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడుకోవా­లని చెబుతున్నారు. తమ వాటాల సంగతి తేలిన తర్వాతే క్వారీయింగ్‌ జరగనిస్తామని చెప్పడంతో భయపడిన క్వారీల యజమానులు పనులు ఆపే­శారు. మైనింగ్‌ అధికారులు కూడా తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కడైనా అధికా­రులు జోక్యం చేసుకుంటే వారిని కూడా బెదిరిస్తు­న్నారు. అనుమతి ఉన్న క్వారీల్లో తవ్వకాలు నిలిపి­వేయడం సరికాదని చెబుతున్నా వినడంలేదు.

నిమ్మకూరులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు యధేచ్చగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలి­తాల వచ్చిన మరుసటి రోజు నుంచే ఎక్క­డెక్కడ మైనింగ్‌కు అవకాశం ఉందో చూసి వెంటనే తవ్వకాలు మొదలుపెట్టేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో వారం రోజులుగా ఎటు­వంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వ­కాలు జరుగుతున్నాయి. ఇది మానవ వన­రులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ దత్తత గ్రామం. 

నిమ్మకూరులో కొందరు రైతుల నుంచి ముగ్గురు టీడీపీ నేతలు 10 ఎకరాలను కొనుగోలు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్‌వోసీ, మైనింగ్‌ అనుమతి వంటివి ఏవీ లేకుండానే పగలు, రాత్రి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు సుమారు 500 లారీల్లో మట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. 20 టన్నుల లారీలో 30 నుంచి 35 టన్నుల మట్టిని నింపి ఏకంగా జాతీయ రహదారిపైనే తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement