రెవెన్యూ కార్యాలయంలో గంగవరం వీఆర్వో పై ఇచ్చిన ఎండార్స్‌మెంట్, పడమర గంగవరం అన్నెం వెంకటరెడ్డికి ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం
భూమి నకిలీ.. భూమిని నమ్మించే పాస్ బుక్కు నకిలీ.. నగదు నకిలీ.. కాదేదీ నకిలీకి అనర్హం. మోసం చేయాలనే ఆలోచన మెదడులో మెదిలితే చాలు దేన్నైనా నకిలీ చేయొచ్చు.. ఇంకా చెప్పాలంటే నకిలీ గాళ్లదే ఈ నయా లోకం. కొన్నేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుంది ఓ ముఠా. గత ప్రభుత్వాల హయాంలో వెబ్‌ల్యాండ్‌ను ఆన్‌లైన్ చేసేందుకు పూనుకున్నారు. అవకాశాన్ని క్యాష్ చేసుకోవడమే పనిగా ఉన్న కొందరు పొలమే లేకుండా ఓ పాస్ బుక్‌ను క్రియేట్ చేసి దాంతో బ్యాంక్‌లను మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ కుంభకోణం అప్పట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా ఇంకా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయంటూ మోసపోయిన బాధితులు భోరున విలపిస్తున్నారు. తాజాగా కురిచేడు మండలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలతో ‘సాక్షి’ కథనం.
కురిచేడు: రైతులను ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య భూ రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలు. గత టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్‌లో పేర్ల నమోదు, పాస్ పుస్తకాల జారీలో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరించడంతో రైతులు ఇరకాట్లలో పడ్డారు. రైతులకు ఇష్టం వచ్చిన సర్వే నంబర్లతో పాస్ పుస్తకాలు జారీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలు తయారు చేయడానికి ఓ ముఠా, బ్యాంకులో ఆ పత్రాలు పెట్టించి రుణాలు ఇప్పించడానికి ఇంకో ముఠా మధ్యవర్తుల అవతారాలెత్తి రైతుల ఖాతాల్లో రుణాలు మాయం చేసిన సంఘటనలు కురిచేడు ఆంధ్రాబ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వెలుగు చూశాయి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ ముఠాల గుట్టు రట్టు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని ఇప్పటికీ అలాంటి ముఠాలు నకిలీలు సృష్టిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు.
ఇవిగో ఇవే ఇప్పటి సాక్షాలు
►కురిచేడు మండలం కాటంవారిపల్లెకు చెందిన సంగు సుబ్బారెడ్డి తన సాగుభూమిని ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని వీఆర్వోను ఆశ్రయించాడు. సుమారు రూ. లక్ష తీసుకుని సుబ్బారెడ్డి భూమికి బదులు వేరొకరి భూమిని పుస్తకంలో నమో దు చేయించి ఇచ్చారని సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బా రెడ్డి ఆ భూమిని వేరే వారికి విక్రయించాడు. తీరా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ పేరుపై పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించగా ఆ భూమి మరొకరి సాగులో ఉంది. కొనుగోలు చేసిన వారు సుబ్బారెడ్డిపై కేసు పెడతామని తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి డబ్బు వెనక్కు ఇచ్చాడు.
►పడమర గంగవరం గ్రామంలో అన్నెం రామిరెడ్డి అదే గ్రామానికి చెందిన అన్నెం పెదపాపిరెడ్డి వద్ద గ్రామ కంఠం సర్వే నంబర్ 331లోని ఎం0–3.1/2 సెంట్లు ఇంటి స్థలం, మట్టిమిద్దెను 1999లో కొనుగోలు చేసి స్వాధీన అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదే స్థలానికి ఓ వీఆర్వో ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2019లో పెదపాపిరెడ్డి భార్య రామలక్ష్మమ్మ, పడమర గంగవరం గ్రామానికి చెందిన చినపాపిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి 2019లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఆ వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని, ఆ గ్రామానికి ఆయన వీఆర్వో కాదని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడంతో కొనుగోలు చేసిన వారు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నకిలీల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది.
రెవెన్యూ కార్యాలయంలో గంగవరం వీఆర్వో పై ఇచ్చిన ఎండార్స్‌మెంట్, పడమర గంగవరం అన్నెం వెంకటరెడ్డికి ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం
లక్ష రూపాయిలిచ్చి నకిలీవి తీసుకున్నా
పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలని వీఆర్వోని అడిగితే డబ్బులు కావాలన్నాడు. ఆయన అడిగినంత ఇచ్చాను. నాకు నకిలీ పుస్తకాలు ఇచ్చి మోసం చేశాడని ఆ పొలాన్ని మళ్లీ అమ్మితేకానీ తెలియలేదు. నాలాగా నష్టపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేసి నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి.
– సంగు సుబ్బారెడ్డి, రైతు, కాటంవారిపల్లె
ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం
మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్టాలు, సర్టిఫికెట్ల విషయం బయటకు వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాను. ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ మేరకు నడుచుకుంటాం.
– అద్దంకి శ్రీనివాసరావు, తహసీల్దార్, కురిచేడు
Comments
Please login to add a commentAdd a comment