జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
వర్గ రాజకీయాలకు ఆజ్యం
దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
సీట్ల కేటాయింపులో మొండిచేయి
ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దామచర్ల తీరుతో మనస్తాపం...
ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్‌ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
మా కార్యకర్తలతో సమావేశమా...
అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment