సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్‌ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్‌ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఆశాజనకం
గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది.
తగ్గిన ఇన్‌ఫ్లో
ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment