Flood Increase In Krishna River - Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో వరద జోరు

Published Fri, Jul 28 2023 4:29 AM | Last Updated on Fri, Jul 28 2023 7:47 PM

Flood in Krishna river - Sakshi

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 1.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ 93.28 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 1.75 లక్షల క్యూసె­క్కులను కర్ణాటక అధికారులు వదులుతు­న్నారు. ఇప్పటికే నారాయణపూర్‌ డ్యామ్‌ నిండుకుండలా మారడంతో.. గేట్లు ఎత్తేసి 1.18 లక్షల క్యూసెక్కులను దిగు­వకు వదిలేస్తున్నారు.

ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో గేట్లు ఎత్తి 27,846, విద్యుదుత్పత్తి చేస్తూ 42,576 వెరసి 70,422 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ జలాలకు హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కులు తోడవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 71,547 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 817.7 అడుగుల్లో 39.2 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ నుంచి పులిచింతలలోకి వరద ప్రవాహం కొనసా­గుతోంది. 18,239 క్యూసెక్కులు చేరుతుండటంతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మున్నేరు వరదకు కట్టలేరు, పాలేరు, వైరా, వాగులు, వంకల ప్రవాహం తోడవుతు­న్నా­యి.

దీంతో గురువారం సాయంత్రం 6 గంట­లకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,37,294 క్యూ­సెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయి­లో అధికా­రులు సముద్రంలోకి వదిలే­స్తున్నారు. బేసిన్‌­లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శుక్రవా­రం కూడా కృష్ణా నదిలో ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది.

సగం నిండిన తుంగభద్ర
కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లోనూ విస్తారంగా వర్షాలు కురు­స్తున్నాయి. దాంతో తుంగభద్రలో వర­ద ప్రవాహం మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,11,566 క్యూసె­క్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 49.76 టీఎంసీలకు చేరుకుంది. అంటే తుంగభద్ర డ్యామ్‌ దాదాపుగా సగం నిండింది. వరద ప్రవాహం ఇదే రీతి­లో కొనసాగితే ఈనెల 31 నాటికి తుంగభద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బ్యారేజ్‌ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement