సాక్షి అమలాపురం: రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకే అమలాపురం తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరచుకుంటున్నాయి. ఎదురుగా ఖాళీ స్థలంలో వేసిన టెంట్లలో వంటావార్పు పనులు ఆరంభమవుతున్నాయి. వారికి రెవెన్యూ ఉద్యోగులు సహకారం అందిస్తున్నారు. రాత్రి మూడు గంటలకల్లా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అక్కడకు చేరుకుని అల్పాహారాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. 5 గంటలకు సచివాలయ మహిళా ఉద్యోగులు, వలంటీర్లు వచ్చి ప్యాకింగ్‌లో సహాయం చేస్తున్నారు. అలా మొదలవుతున్న పనులు సాయంత్రం 4గంటల వరకూ నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను వంటవారు తయారు చేయడం.. వీరు ప్యాకింగ్ చేయడం.. వెంటనే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వాటిని ఆయా ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. ఒక్కో షిఫ్టుకు 50 నుంచి 60 మంది వరకూ వస్తున్నారు. ఉదయం అల్పాహారం అందించేందుకు తెల్లవారకుండానే వరద బాధితుల ఇళ్లకు పరుగులు తీస్తున్నారు.
వలంటీర్ల సేవలు మరువలేం..
కోనసీమ జిల్లా అమలాపురం, మామిడికుదురు, పి.గన్నవరం మండలాల పరిధిలోని వరద బాధితులకు జిల్లా యంత్రాంగం ఈ విధంగా వంటలు చేయించి ప్రతిరోజూ అందిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో 18 వేల మందికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ లేదా బజ్జీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు, కూరగాయలతో చేసిన మరో కూర, సాంబారు అందిస్తున్నారు. వీటిని ప్యాకింగ్ చేయడం, బాధితులకు అందజేయడంలో కీలకంగా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అటు ఉన్నతాధికారుల నుంచి, ఇటు బాధితుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘వంట చేయడం సులువైన పనే. కానీ వాటిని శ్రద్ధగా, పాడవకుండా ప్యాకింగ్ చేయడం ఇబ్బందికరం. వరద ముంపులో వాటిని పంపిణీ చేయడం కష్టతరం. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సేవలను మరువలేం’ అని అమలాపురం తహసీల్దార్ శ్రీవల్లి అన్నారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు
Comments
Please login to add a commentAdd a comment