
సాక్షి, రాజమహేంద్రవరం: ఈనాడు రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా కోర్టు నుంచి స్టే తెచ్చుకోగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. రామోజీరావు కోర్టుల నుంచి తెచ్చుకున్న స్టేలపై తాను ఒక పుస్తకమే రాస్తానని, లా విద్యార్థులకైనా ఉపయోగపడుతుందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై తాను కేసు వేసి 16 ఏళ్లయిందని, అది ఎప్పు డు తేలుతుందో, అప్పటివరకు తాను ఉంటానో లేదోనని వ్యాఖ్యానించారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమన్నారు.
మార్గదర్శి అకౌంట్ బుక్స్ ఎవరూ చెక్ చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు. రామోజీకి, మార్గదర్శికి సంబంధం లేదని కోర్టులో చెప్పినప్పటికీ అన్ని సంస్థలకూ చైర్మన్ రామోజీ అనే సంతకం ఉందన్నారు. చిట్‌ఫండ్ కంపెనీ డబ్బును ఇతర వ్యాపారాలకు వాడకూడదన్న నిబంధనలనూ పట్టించుకోలేదని అన్నారు. మార్గదర్శి రూ.1,300 కోట్లు నష్టాల్లో ఉందని రంగాచారి కమిషన్ చెప్పిందన్నారు.
12 చానళ్లు అమ్మి నష్టాలు పూడ్చానని ఆయన అంటున్నారని, అది నిజమని తాము నమ్మడంలేదని చెప్పారు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశానంటున్న రామోజీ ఎవరికి ఇచ్చారనేది ప్రశ్నార్థకమన్నారు. ఆయన కోర్టుకు తప్పుడు పేర్లు సమర్పించారని, అందులో ఎల్‌కే అద్వానీ, ఉపేంద్ర అనే పేర్లు కూడా ఉన్నట్లు తాను చూశానన్నారు. మార్గదర్శికి డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై ఈడీ విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి లేఖ రాశానన్నారు. అయితే, 12 చానళ్ల విక్రయ లావాదేవీలపై సెబీ విచారణ జరపాలని, రామోజీ ఫిలిం సిటీ వయోలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్‌పై స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని ఆర్వోసీ తెలిపిందన్నారు.
ప్రభుత్వం చిట్‌ఫండ్ కంపెనీలపై విచారణ జరుపుతున్నందున, మార్గదర్శిపైనా దర్యాప్తు జరపాలని, తన వద్ద ఉన్న ఆధారాలన్నీ ఇస్తానని అన్నారు. రాష్ట్ర విభజన, అమరావతి రాజధానిపై ‘విభజన వ్య«థ’ అనే పుస్తకం రాస్తున్నానని ఉండవల్లి చెప్పారు. అమరావతి రాజధానిని మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి తానేనని తెలిపారు. రాజధాని అక్కడ పెట్టడం సరికాదని, అది భ్రమరావతి అని చెప్పిందీ తానేనన్నారు.