సొంత స్కూల్‌కు తాడిపూడి కాల్వ మట్టి
వందలాది లారీలతో ప్రాంగణంలో మెరక
అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీస్ ట్రీట్‌మెంట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మట్టి మాఫియాకు కేంద్రంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తాడిపూడి కాల్వ గట్లకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తూట్లు పొడుస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వందలాది లారీల మట్టిని స్వాహా చేస్తున్నారు. ఇందులో దాదాపు 300కు పైగా లారీల మట్టితో ఎమ్మెల్యేకు చెందిన స్కూల్ గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు.
దీని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని అంచనా. నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని తెలికిచర్లలో గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే తెగబడ్డారు. వారం రోజుల క్రితం వరకు జనసేన, టీడీపీ చోటా నేతలు గ్రావెల్ తవ్వకాలు కొనసాగించగా.. ఆ తరువాత ఎమ్మెల్యే బొలిశెట్టి రంగంలోకి దిగి సొంతంగా దందా నిర్వహిస్తున్నారు.
జగ్గన్నపేటలో ఉన్న తాడిపూడి గట్లను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జికి గ్రావెల్ వంతు వచ్చింది. సోమవారం నుంచి ఆయనకు చెందిన లేఅవుట్లు, స్థలాలకు జగ్గన్నపేట నుంచే గ్రావెల్ తవ్వకం ప్రారంభమైంది.
అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీస్ కౌన్సెలింగ్
పార్టీ కోసం తాము తంటాలు పడుతుంటే.. తమ ఊళ్లోకి ఎవరో వచ్చి మట్టి తవ్వకుంటున్నారంటూ జగ్గన్నపేటకు చెందిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న ఐదుగురినీనాలుగు రోజుల నుంచి తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి పంపుతూ కౌన్సెలింగ్ పేరిట పోలీస్ ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు.
స్పందించని జిల్లా కలెక్టర్
ఈ విషయంపై కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేయడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొట్టు సత్యనారాయణ పలుసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించని పరిస్థితి నెలకొంది. స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment