బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పుత్తడిబొమ్మలకు మూడుముళ్ల బంధనాలు వేసి వారి భవితను చిదిమేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహన లోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించి పుస్తెల భారం వేయకుండా పుస్తకాలతో చెలిమి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు అధికారులు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా..ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారేమో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లకు వయస్సు రాగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి 2022 వరకు 589 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని అనుకుంటున్న బాలికలకు కొంతమంది తల్లిదండ్రులు మూడుముళ్లతో బంధనాలు వేసి సంసార సాగరంలోకి తోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తెలు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ ఒక వైపు ఊరూరా ప్రచారం చేస్తూ, మరో వైపు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేస్తున్నారు.
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
బాల్య వివాహాలు ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి జరుగుతున్నాయి. బాల్య వివాహాల జరుగుతున్న ప్రదేశాలకు అధికారులు వెళ్లి పెళ్లి అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీటిపై అన్ని మండల కేంద్రాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ఈ నెల 17 వ తేదీ నుంచి 25 లోపు గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్‌లైన్ 1098, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
2012లోనే జీవో జారీ...
బాల్య వివాహ నిరోధక చట్టం 2006కు సంబంధించిన జీవో నంబరు 13ను 2012 మార్చి 19న ప్రభుత్వం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటును సూచించింది. జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా ఐసీడీఎస్ పీడీ, ఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో చైర్మన్‌గా ఆర్డీఓ, సీడీపీఓ, డీఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీకి చైర్మన్‌గా తహశీల్దారు, మెంబరు కన్వీనర్లుగా ఐసీడీసీ సూపర్‌వైజర్, ఎస్‌ఐ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా అంగన్‌వాడీ కార్యకర్త, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామానికి చెందిన ఉపాధ్యాయడు, మహిళ వార్డు మెంబరు, ఏఎన్‌ఎం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, యువజన సంఘం ప్రతినిధి, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు.
బాల్య వివాహం నేరానికి శిక్ష..
బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారికి, చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని దాచేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఆ వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. న్యాయమూర్తి ఉత్తర్వుల ఉల్లంఘన కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను ఆపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధించే అవకాశం ఉంది.
ఆర్థిక ఇబ్బందులు...పిల్లల ప్రవర్తన కారణంగా..
చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే.. అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. మరి కొందరైతే రకరకాల కారణాల ప్రభావంతో పిల్లలు పెడదారి పడుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు.
అడ్డుకుంటున్నా ..ఆగడం లేదు
బాల్య వివాహాలను మాతాశిశు సంరక్షణ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంత వరకు బాల్య వివాహాలు తగ్గినట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment