
క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
జననేతను కలిసేందుకు ఎగబడిన అభిమానులు
తొలిరోజంతా కార్యకర్తలతోనే..
టీడీపీ దాడుల్లో గాయపడ్డ వారిని పరామర్శిస్తానని వెల్లడి
సాక్షి కడప/రాయచోటి/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారు. పుట్టినగడ్డలో ఆయన అడుగుపెట్టగానే జనం ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా మాజీ సీఎంకు హారతులు పడుతూ మహిళలు దిష్టితీయగా, మరికొందరు పుష్పగుచ్ఛాలు అందించారు.
ఆ తర్వాత పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. జగన్‌ను చూడగానే జనమంతా ఒక్కసారిగా ‘సీఎం సీఎం’.. అంటూ ఈలలు, కేకలతో ఉత్సాహం ప్రదర్శించారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ కలుస్తూ అడిగిన వారికి ఫొటో తీసుకునే అవకాశమిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తొలిరోజంతా కార్యకర్తలతోనే గడిపారు.
జగన్‌ను కలిసిన పలువురు నేతలు
ఇక మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జగన్ వెన్నంటే ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు.
ఎంపీతో పాటు రాజంపేట, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, చంద్రశేఖర్.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ‘మండలి’ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్‌వి సతీష్ కుమార్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అనేక విషయాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడారు.
టీడీపీ దాడులపై జగన్ ఆరా
మరోవైపు.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ కౌన్సిలర్లపై టీడీపీ రౌడీమూకలు చేసిన దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. రాయచోటి 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ బాషా, స్థానిక మైనార్టీ నేతలు దాడి సంఘటనను ఆయనకు వివరించారు.
ఈ దాడిలో 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ బాషా కత్తిపోట్లకు గురికాగా, హరూన్ బాషా ఇంటి ముంగిట ఉన్న బైకును బండరాళ్లతో బాది ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్ దాడిలో గాయపడిన వారికి ధైర్యాన్నిచ్చారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలుస్తామన్నారు.
కాన్వాయ్‌లో వాహనాల ఢీ అవాస్తవం..
ఇదిలా ఉంటే.. కడప విమానాశ్రయంలో దిగిన జగన్ తన కాన్వాయ్‌లో పులివెందులకు బయల్దేరారు. రామరాజుపల్లె వద్ద వేచి ఉన్న అభిమానులను కలిసేందుకు ఆయన వాహనాన్ని ఆపమన్నారు. అదే సమయంలో కాన్వాయ్‌తో సంబంధంలేని వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో వేరే కారులో పులివెందుల వైపు వెళ్తున్నారు. ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో కాన్వాయ్‌లో చివరగా ఉన్న అగ్నిమాపక వాహనాన్ని వెనుకవైపు ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిందని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ తెలిపారు. కానీ, మాజీ సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయని వెలువడిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారన్నారు.
పచ్చ మీడియాలో దుష్ప్రచారం
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన్ను పలకరించేందుకు పెద్దఎత్తున ప్రజానీకం పులివెందుల చేరుకున్నారు. మ.2 గంటలకు పులివెందులకు వస్తారనుకున్న ఆయన ఐదు గంటలకు చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున అభిమానులు అక్కడకు తరలివచ్చారు. బారులు తీరిన జనాన్ని కలుస్తూ, వారిని ఊరడిస్తూ అధినేత వైఎస్ జగన్ ఉండిపోయారు. అంతేకాక.. తమ అభిమాన నేతను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు.
ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో నగిరిగుట్టకు చెందిన ఓ యువకుడు క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలపై పడ్డాడు. అద్దాలు పగిలి చేతికి గాయం కూడా అయ్యింది. వాస్తవం ఇలా ఉంటే, జగన్‌కు పులివెందులలోనే ప్రతిఘటన.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలంటూ పచ్చమీడియాలో తెగ దుష్ప్రచారం చేశారు.
దీనిపై పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌రెడ్డి వివరణ ఇస్తూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సమయంలో కార్యకర్తల తోపులాట జరిగి కిటికీ అద్దాలు పగిలాయి కానీ, ఎలాంటి రాళ్లదాడి జరగలేదని, ఎవరూ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. కేవలం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపడంతో ఒకరిపై ఒకరు పడి తోపులాట మాత్రమే జరిగిందన్నారు.