ఈ–సైకిళ్ల జోరు.. ప్రయాణంలో హుషారు | Sakshi
Sakshi News home page

ఈ–సైకిళ్ల జోరు.. ప్రయాణంలో హుషారు

Published Sun, Aug 20 2023 4:33 AM

Growing cycling in the country - Sakshi

సాక్షి, అమరావతి: భారతదేశంలో సైక్లింగ్‌పై మక్కువ పెరుగుతోంది. కరోనా తర్వాత ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ స్పృహతో చాలామంది సైకిళ్లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్‌లో ఈ–సైకిళ్ల వాడకం జోరందుకుంది.

సంప్రదాయ శిలాజ ఇంధనాలను విడుదల చేసే వాహనాలు తక్కువ దూరం ప్రయాణించడంలో పర్యావరణాన్ని దెబ్బతీయడంతోపాటు రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ–సైకిళ్లే భవిష్యత్‌గా గుర్తించిన కంపెనీలు బహుళార్థ సాధక ప్రయోజనాన్ని కలిగేలా డిజైన్లు చేస్తున్నాయి. కొన్ని మెట్రో సిటీలు, నగరాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు రోడ్లపై ప్రత్యేక పాత్‌వేలు నిర్మిస్తుండటం విశేషం.

యాప్‌ సాయంతో కంట్రోల్‌ 
టెక్‌ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు ఈ–సైకిళ్లలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. యాప్‌ సాయంతో నియంత్రించే ఈ–సైకిల్, ఈ–బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. మొబైల్‌ ఆధారిత యాప్‌ల ద్వారా వినియోగదారులకు వారి వేగం, దూరం, కేలరీలు కరిగిపోవడం, హృదయ స్పందన రేటుపై రియల్‌ టైమ్‌ అప్‌డేట్‌లను అందిస్తున్నాయి. వాస్తవానికి దేశంలో ఈ–సైకిళ్లు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వాటి కొనుగోళ్లు ఏటా రెట్టింపు అవుతున్నాయి.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసీసీఐ), క్లిన్‌వెల్డ్‌ పీట్‌ మారి్వక్‌ గోర్డెలర్‌ (కేపీఎంజీ) నివేదిక ప్రకారం త్వరలోనే భారతదేశ ఈ–సైకిల్‌ మార్కెట్‌ మిలియన్‌ యూనిట్లకు పైగా ఉంటుందని అంచనా.

గ్లోబల్‌ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ మార్కెట్‌ పరిమాణం 2021లో 18.58 బిలియన్ల డాలర్ల నుంచి 2028లో 52.36 బిలియన్ల డాలర్లకు వృద్ధి చెందడంతోపాటు భారతదేశంలో ఈ–సైకిల్‌ మార్కెట్‌ విలువ 2021లో 1.02 మిలియన్‌ డాలర్ల నుంచి 2026 నాటికి 2.08 మిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తర్వాత  సైక్లింగ్‌ గణనీయంగా పెరుగుతుందనడానికి ఉదాహరణ.. యూరప్‌ మొత్తం పరిశ్రమల్లో 50 శాతం కంటే ఎక్కువ ఈ–సైకిళ్లు ఉత్పత్తి కావడమే. 

సైక్లిస్ట్‌ ఫ్రెండ్లీ వాతావరణం 
ప్రస్తుతం దేశంలో చిన్నారులు, యువతతో పాటు మౌంటైన్‌ బైక్స్‌ విభాగంలో ఈ–సైకిళ్లలో ఎక్కువ వృద్ధి నమోదవుతోంది. ప్రతిరోజూ దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తక్కువ దూరం (20 కిలోమీటర్ల లోపు) ప్రయాణిస్తున్నట్టు సెన్సస్‌ డేటా చెబుతోంది. ఈ ప్రయాణ విధానానికి ఈ–సైకిల్స్‌ సరైన పరిష్కారమని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు.

చురుకైన జీవనశైలి, సాహనం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే పట్టణ వాసులే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. పాశ్చాత్య నగరాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సైక్లిస్ట్‌ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.  ప్రధానంగా ఈ–సైకిళ్లలో థొరెటల్‌ అసిస్ట్, పెడల్‌ అసిస్ట్‌ అనే రెండు రకాలు ఉన్నాయి. థొరెటల్‌ అసిస్ట్‌ అంటే మోటార్‌ను ఆన్‌ చేస్తే బైక్‌ పెడల్‌ చేయకుండా ముందుకు కదులుతుంది. పెడల్‌ అసిస్ట్‌ అంటే సైక్లిస్ట్‌ పెడల్‌ చేస్తున్నప్పుడు మాత్రమే మోటార్‌ రన్నింగ్‌లో ఉంటుంది.

పెడల్‌ సహాయక ఎలక్ట్రిక్‌ బైక్‌లను మనం సంప్రదాయ సైకిల్‌ను తొక్కడంతో పోలి్చనప్పుడు మానవ ప్రయత్నాన్ని 70–80 శాతం వరకు తగ్గిస్తాయి. అయితే ప్రామాణిక మోటార్‌ బైక్‌లతో పోలిస్తే ఈ–సైకిళ్లు వైరింగ్, డిజైన్, మోటార్‌/మినీ ఇంజిన్, బ్యాటరీ శక్తి కారణంగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఈ–సైకిల్‌ ధర ఎక్కువగా దాని గ్రేడ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సుమారు రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా పలుకుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement