సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా సాగిన దోపిడీ, ప్రజాధనం లూటీకి టిడ్కో ఇళ్లే నిలువెత్తు సాక్ష్యం. ఈ నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది.. ఇసుక ఉచితం.. నిర్మాణ అనుమతులకు ఎలాంటి ఫీజులూ లేవు. వసతులు, సదుపాయాలు కల్పించాలన్న నిబంధన కూడా టెండర్లలో లేదు. అలాంటప్పుడు మార్కెట్ రేటు కంటే టిడ్కో ఇళ్ల నిర్మాణ ధర తగ్గాల్సింది పోయి రెట్టింపు కావడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. నిరుపేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది.
ఎనిమిది కంపెనీలకు కాంట్రాక్టు..
పట్టణాల్లో సొంత ఇల్లు లేని సుమారు 5 లక్షల మందికి జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో టిడ్కో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ. విస్తీర్ణంలో కట్టే టిడ్కో ఇళ్లకు నాటి మార్కెట్ ధర కంటే రెండింతలు పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. కంపెనీని బట్టి చ.అడుగుకు రూ.2,534.75 నుంచి రూ.2034.59 మధ్య నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. సగటున చ.అడుగు నిర్మాణ ధర రూ.2,203.45 చొప్పున టెండర్లు అప్పగించారు. అంటే బయట మార్కెట్ కంటే అదనంగా రూ.1203.45 పెంచారు.
తొలి విడతలో 2,08,160 టిడ్కో యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించే కాంట్రాక్టును ఎనిమిది కంపెనీలకు కేటాయించారు. నిజానికి అప్పుడు పట్టణాల్లో ప్రైవేట్ అపార్ట్‌మెంట్లను చ.అడుగు రూ.1,000 లోపే నిర్మిస్తుండటం గమనార్హం. టిడ్కో ఇళ్లకు నాడు ఇసుక ఉచితం. సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా తక్కువే కాబట్టి వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపైంది. టిడ్కో ఇళ్లను షీర్‌వాల్ టెక్నాలజీలో నిర్మిస్తున్నందున గరిష్టంగా చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.1000కి మించదని ఈ విధానంలో ఎన్నో ఏళ్లుగా అపార్ట్‌మెంట్లు కడుతున్న కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
రివర్స్ టెండర్లతో ఖజానాకు ఆదా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రివర్స్ టెండరింగ్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో 2020 ఏప్రిల్‌లో 54,056 టిడ్కో యూనిట్లకు చ.అ. నిర్మాణానికి సగటున రూ.1,655.31 చొప్పున టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయించిన దానికంటే చ.అడుగుకు రూ.548.14 తక్కువ ధరకు టెండర్లు చేయడంతో ఖజానాకు దాదాపు రూ.321 కోట్లు ఆదా అయ్యాయి.
పైగా ఈ నిర్మాణాలకు ఇసుక ఉచితం కాదు. సిమెంటు, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి, కూలీల రోజువారి వేతనాలు అన్నీ గత ప్రభుత్వ హయాం కంటే ఎక్కువే ఉన్నా ధర తగ్గించి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును చంద్రబాబు బృందం తమ అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నదనేందుకు ఇది నిదర్శనం.
ఇంటికి రూ.2 వేలు.. ఫ్లాట్‌కి రూ.1,500
సాధారణంగా వ్యక్తిగత ఇల్లు, అపార్ట్‌మెంట్ నిర్మాణాల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంటికి అయిన ఖర్చులో అపార్ట్‌మెంట్‌కు సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు వ్యక్తిగత ఇల్లు నిర్మాణ ధర చ.అ రూ.2 వేలు ఉంటే అపార్ట్‌మెంట్‌లో చ.అ. రూ.1500 వరకు ఉంది. ఇవన్నీ ఎక్కువ మంది కోరుకునే ప్రాంతాల్లో చెబుతున్న సరాసరి ధరలు. అదే పట్టణాలకు దూరంగా నిర్మిస్తే గరిష్టంగా రూ.700 నుంచి రూ.900 మించదు. – వీవీఎన్ యుగంధర్, భవన నిర్మాణ సంస్థ యజమాని, కాకినాడ
రూ.1,200 మించదు
కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. టిడ్కో ఇళ్లు ప్రారంభించినప్పుడు కాకినాడలో అపార్ట్‌మెంట్లు కట్టా. స్థలంతో కలిపి అన్ని సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఫ్లాట్లను చ.అడుగు రూ.1,900 నుంచి రూ.2,000 మధ్యనే ఇచ్చాం. అలాంటిది ప్రభుత్వ స్థలంలో ఉచిత అనుమతులు, ఉచితంగా ఇసుక ఇస్తే చ.అడుగుకు గరిష్టంగా రూ.800 మాత్రమే అవుతుంది. టిడ్కో ఇళ్లకు అప్పుడు ఇన్ని వసతులు కూడా లేవు. అన్ని వసతులతో అద్భుతంగా కడితే చ.అ రూ.1,200కి మించే అవకాశం లేదు.
– బసవా ప్రసాద్, బిల్డర్(కాకినాడ)
అక్రమాలు జరిగినట్లే..
పట్టణంలో ఒక అపార్ట్‌మెంట్ కట్టాలంటే ఫీజుల రూపంలో చ.అడుగుకు రూ.270 వరకు చెల్లించాలి. ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి అధికంగా ఖర్చవుతుంది. స్థలంతో కలిపి 2016–17లో విశాఖలో మేం కట్టిన అపార్ట్‌మెంట్‌లో చ.అ. రూ.2వేల నుంచి రూ.2200కే ఇచ్చాం. అన్ని వసతులు కల్పించాం. పేరున్న కంపెనీల వస్తువులనే వాడాం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. నాడు ఇసుక కూడా ఉచితం. ఇంటీరియర్ సొబగులు లేవు. మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి నిర్మాణాల్లో చ.అ రూ.700కి మించి ఖర్చుకాదు. ఆ ధర దాటిందంటే అక్రమాలు జరిగినట్టే. – బర్కత్ అలీ, బిల్డర్ (విశాఖపట్నం)
ఇప్పుడూ అంత ధర లేదు
ఎన్నో ఏళ్లుగా కాకినాడలో నిర్మాణాలు చేస్తున్నాం. అ పార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల ధర అన్ని సదుపాయాలు, స్థల ంతో కలిపి ఇప్పుడైతే చ.అ. రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. విశాఖలో మరో రూ.2 వందలు ఎక్కువ ఉంది. నాలుగైదేళ్ల క్రితం అయితే ఇందులో సగం కూడా లేదు. ప్రభుత్వ ప్రాజెక్టులైతే ఫీజులు ఉండవు కాబట్టి రూ.వందల్లోనే ఉండాలి. – ఎం.గంగబాబు, బిల్డర్ (కాకినాడ)
Comments
Please login to add a commentAdd a comment