పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు | Harassment Of Loan App Recovery Agents On The Rise In Nellore | Sakshi
Sakshi News home page

పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు 

Published Sat, Jul 30 2022 9:08 AM | Last Updated on Sat, Jul 30 2022 9:33 AM

Harassment Of Loan App Recovery Agents On The Rise In Nellore - Sakshi

నెల్లూరు (క్రైమ్‌) :  లోన్‌ యాప్స్‌కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. 

పదేపదే ఫోన్లుచేసి.. 
చెన్నైలోని కోల్‌మాన్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలకు లోన్‌ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్‌ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్‌ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్‌రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్‌ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్‌ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్‌ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను 
అరెస్టుచేశారు.  

మాజీమంత్రికి సైతం.. 
మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్‌కుమార్‌ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్‌ రికార్డు ఆడియో సోషల్‌ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను సీజ్‌ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని 
ఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement