రెండు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన
ఒడిశాలో అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో వర్షాలు
19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్
అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపుగా కదులుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి విదర్భ, గోపాల్‌పూర్ మీదుగా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉంది.
వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. మరో అల్పపీడనం ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
19న మరో అల్పపీడనం!
ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది ఏర్పడితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేకచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
గజపతినగరం మండలం ముచ్చర్లలో 2.8 సెం.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 2.6 సెం.మీ. వర్షం పడింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో 6.8 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లా కృత్తివెన్ను మండల కేంద్రంలో 6.6, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 5.9, కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 5.8, బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజుగడ్డలో 5.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment