
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: రుతుపవన ద్రోణి మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. శుక్రవారం కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రావులపాలెంలో 12 సెం.మీ, అడ్డతీగలలో 9.5, రంగాపురంలో 7.2, ఆత్రేయపురంలో 6.6, నాగాయలంకలో 6.0, చిలకలూరిపేటలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.
సెప్టెంబర్‌లో విస్తారంగా వానలు
ఆగస్టులో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 139.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 138.5 మి.మీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో 162.1 మి.మీ వర్షానికి 169 మి.మీ వర్షం పడింది. రాయలసీమలో 108.5 మి.మీటర్లకు 96.4 మి.మీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 4 జిల్లాల్లో కురవాల్సిన దాని కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటంతో ఈ సీజన్‌లోనే ఎక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment