
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో శనివారం (11వ తేదీన) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. క్రమంగా దక్షిణ ఒడిశా, ఒడిశా ప్రాంతాల మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు గుజరాత్ సమీపంలో అరేబియా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటం వల్ల తేమ గాలులు రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో పలాసలో 67 మిల్లీమీటర్లు, సోంపేటలో 63, వజ్రపుకొత్తూరులో 56, మందసలో 40.75, నరసన్నపేటలో 33.4, గారలో 22, ఎల్‌ఎన్‌పేటలో 19, సంతబొమ్మాళిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.