గుంటూరు ఎడ్యుకేషన్: అధికారంలో ఉండగా ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏరోజూ మాట్లాడలేదన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీజేపీతో విడిపోయిన తరువాత దొంగ దీక్షలు చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆనాడు కేంద్రం స్పష్టం చేసినప్పుడు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించని చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాలు అంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.
‘ఉక్కు’పై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు పవన్..
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్నానని చెబుతున్న పవన్ కల్యాణ్.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న పవన్‌కల్యాణ్.. విశాఖ ఉక్కుపై ముందు కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కాగా, కల్తీ విత్తనాలు, తెగుళ్లు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment