సాక్షి, అమరావతి : సీఆర్డీఏ పరిధిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 50,004 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తుంటే దానిని చూసి ఓర్వలేక నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన భజన బృందంలోని ఎల్లో మీడియా.. తమ పాచికలు పారకపోవడంతో ఇప్పుడు టిడ్కో ఇళ్లపై మొసలికన్నీరు కారుస్తోంది. నిజానికి.. అమరావతి పరిధిలోని నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో 5,024 టిడ్కో ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేపట్టినా, ఆనాడు వాటికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వదిలేశారు.
అనంతరం జగనన్న ప్రభుత్వం వచ్చాక ఆయా నివాసాలకు తాగునీరు, ఎస్టీపీ, విద్యుత్ వంటి సౌకర్యాలకు రూ.75 కోట్లు వెచ్చించింది. ఇక్కడ నిర్మించిన సముదాయాల్లో 300 చ.అడుగుల్లో 992 ఇళ్లు, 365 చ.అ. విస్తీర్ణంలో 1,536.. 430 చ.అ. విస్తీర్ణంలో 2,496 యూనిట్లు మొత్తం 5,024 టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ప్రభుత్వ సబ్సిడీ పోగా 300 చ.అ. ఇంటికి 2.65 లక్షలు బ్యాంకు రుణంగా పొంది 20 ఏళ్ల పాటు చెల్లించాలని బాబు సర్కారు షరతు విధించింది.
అంటే ఒక్కో లబ్దిదారుడు ఇంటికి రూ.7.20 లక్షలు చెల్లించాలి. ఇక్కడి నివాసాల్లో 992 యూనిట్లు నిరుపేదలకు కేటాయించినవే. వారందరిపైనా బాబు మోపిన ఆర్థిక భారం అక్షరాలా రూ.71.42 కోట్లు. కానీ, ఈ మొత్తాన్ని జగనన్న ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు రూ.1కే ఇంటిని కేటాయించింది.
రూ.112.86 కోట్ల మేర బాబు అదనపు భారం..
ట‘బి’ కేటగిరిలో ఉన్న 365, 430 చ.అ. ఇంటికి రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున లబ్దిదారు వాటాగా చెల్లించాలని బాబు సర్కారు షరతు పెడితే, జగనన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.25 వేలు, రూ.50 వేలకు తగ్గించింది. ఫలితంగా అమరావతిలోని ఈ రెండు కేటగిరీల లబ్దిదారులపై ప్రస్తుత ప్రభుత్వం రూ.16.32 కోట్ల భారాన్ని తగ్గించడంతో పాటు మూడు కేటగిరీల ఇళ్లకు లబ్ధిదారుల భారం రూ.87.74 కోట్లను రద్దుచేసింది.
పైగా రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండడంతో మరో రూ.25.12 కోట్ల భారం లబ్దిదారులకు తగ్గిపోయింది. అంటే గత ప్రభుత్వం మోపిన రూ.112.86 కోట్ల భారాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది.
♦ అంతేగాక.. పేదలకు ఇచ్చిన 300 చ.అ ఇళ్లను రూ.2.65 లక్షల చొప్పున 323 మంది బ్యాంకుల నుంచి రూ.6.46 కోట్లు రుణాలు తీసుకుంటే జగన్ సర్కారు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి సదరు లబ్ధిదారులకు రూ.1కే ఇంటిని కేటాయించింది.
♦ ఇక ప్రస్తుతం టిడ్కో ఇళ్లు ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో గత సర్కారు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం రూ.75 కోట్లతో తాగునీరు, ఎలక్ట్రిక్ పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి వసతులు కల్పించింది. అలాగే, ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ పనులను మరో రూ.17.06 కోట్లతో చేపట్టింది.
♦ ఇక తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నవులూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో వాటికి తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టును ప్రస్తుత వైఎస్సార్‌సీపీ రూపొందించింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దేందుకు జగన్ సర్కారు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇటు పేదలపై ఆర్థిక భారం పడకుండా చేస్తోంది. ఇలా అన్ని రకాలుగా ఇక్కడి లబ్దిదారులకు రూ.200 కోట్ల మేర లబ్ధిని చేకూర్చింది.
మరోవైపు.. అన్ని వసతులతో సిద్ధమైన 5,024 టిడ్కో ఇళ్లను మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో అందించేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. కానీ, అమరావతిలోని టిడ్కో లబ్దిదారులను ఆర్థికంగా దెబ్బతీసేలా పథకాలు రూపొందించిన నాటి చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించలేని క్షుద్ర పత్రిక ఈనాడుకు ప్రస్తుత సర్కారు ఇంత మేలు చేస్తున్నా కనిపించకపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment