ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ | Huge applications for AP EAPCET | Sakshi
Sakshi News home page

ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ

Published Fri, Jul 1 2022 3:15 AM | Last Updated on Fri, Jul 1 2022 7:50 AM

Huge applications for AP EAPCET - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2022కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా మూడు లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గరిష్ట ఆలస్య రుసుము గడువులో సైతం   దరఖాస్తులు సమర్పిస్తుండడం విశేషం. గురువారం వరకు 3,01,113 మంది రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. వీరిలో 2,99,951 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించారు. రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఇంకా గడువు ఉన్నందున ఈసారి  దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. వీరిలో 1,91,370 మంది ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ అభ్యర్థులు.. 78,381 మంది అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

ఆలస్య రుసుముతో ఇంకా దరఖాస్తులు
ఏప్రిల్‌ 11న సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా ఎ లాంటి ఆలస్య రుసుము లేకుండా మే 10 వరకు ద రఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చారు. ఆ తరువా త ఆలస్య రుసుము రూ.500తో జూన్‌ 20 వరకు, రూ.1,000తో జూన్‌ 25 వరకు, రూ.5,000తో జూ లై 1వరకు, రూ.10,000తో జూలె 3వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు గడువుగా నిర్ణయించారు. ఇక ఆలస్య రుసుము లేకుండా నిర్ణయించిన గడువు మే 10 నాటికి 2,74,260 దరఖాస్తులు దాఖలయ్యాయి. గడువు ముగిసినా ఇంకా  ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు. రూ.5,000 ఆలస్య రుసుముతో కూడా ఇంకా పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడం విశేషం.

ఇక గురువారం కొత్తగా 37 మంది రూ.5వేల ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టారు. జులై 3 వరకు గడువు ఉన్నందున ఈ దరఖాస్తులు ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అత్యధికుల్లో ఆసక్తి
ఇక రాష్ట్రంలో విద్యారంగంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు తేవడంతో పాటు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు చేరికలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇంజనీరింగ్‌ తదితర ఉన్నత సాంకేతిక విద్యా కోర్సులకు ఆయా కాలేజీల్లో ఫీజులు లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.35వేలు మాత్రమే చెల్లించేది. మిగతా మొత్తాన్ని విద్యార్థి చెల్లించాల్సి వచ్చేది. దీంతో తల్లిదండ్రులు అప్పులపాలయ్యేవారు.

ఫలితంగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత చదువులకయ్యే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే రీయింబర్స్‌ చేసేలా జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే, విద్యార్థుల వసతి భోజనాల కోసం ఏటా రూ.20వేల వరకు అందిస్తున్నారు. దీంతోపాటు గత ఏడాది నుంచి రాష్ట్రంలోని వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల సీట్లను కూడా మెరిట్‌లో ఉన్న పేద విద్యార్ధులకు 35శాతం సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరికయ్యే పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా గత ఏడాదిలో 4వేల మంది వరకు వివిధ ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో చేరారు.

జూలై 4 నుంచి ఈఏపీసెట్‌
మరోవైపు.. ఈఏపీసెట్‌ పరీక్షలు జూలై 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ 4 నుంచి 8 వరకు.. అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ జూలై 11, 12 తేదీల్లో జరుగుతాయి. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో ఈఏపీ సెట్‌లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement