కృష్ణా జిల్లా కొడవటికల్లులో ముంపునకు గురైన పత్తి పంటను పరిశీలిస్తున్న జేసీ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేయడానికి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ఇతర అధికారులు వరద ప్రభావ ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా కల్పించారు. అలాగే కూలిన ఇళ్లు, ఇతర నష్టాలను కూడా అంచనా వేశారు. దెబ్బతిన్న ఇళ్లకు, పంటలకు పరిహారం త్వరగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
► అడంగల్‌తో సంబంధం లేకుండా నష్ట పరిహారం వర్తింపుచేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ రైతులకు హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ డొంకూరు తీరప్రాంతం, సోంపేట మండలం రుషికుడ్డ గ్రామ పరిధిలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు.
► విజయనగరం మండలంలోని గొల్లలపేట గ్రామ పరిధిలో నీట మునిగిన వరి పంటను కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పరిశీలించారు. పంట నష్టాన్ని ఈ–క్రాప్‌లో నమోదు చేయాలని, రైతుల వివరాలను, పంట వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
► విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో దెబ్బ తిన్న వరిపైరును, శారదా నది గండిని కలెక్టర్ వినయ్‌చంద్ పరిశీలించారు. పంట నష్టం గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశామని, బాధిత రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. తర్వాత తుది జాబితా రూపొందించి సంబంధిత రైతులకు పరిహారం అందజేస్తామన్నారు.
► వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్క రైతు పేరూ ఎన్యూమరేషన్ జాబితాలో ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సిబ్బందిని ఆదేశించారు. ఉంగుటూరు మండలం కైకరం, బాదంపూడి గ్రామాలల్లో పంటలను ఆయన పరిశీలించారు.
► కృష్ణా జిల్లాలో పంట నష్టాల కోసం నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ తీరును కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు.
► వైఎస్సార్ జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీలు, సబ్ కలెక్టర్లు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లను పరిశీలించారు. చాపాడు మండలం లక్ష్మిపేట గ్రామాన్ని సందర్శించారు. పంట, ఇళ్ల నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించామని, నష్టపోయిన రైతులకు అంచనా మేరకు పరిహారం అందిస్తామన్నారు.
► కర్నూలు జిల్లాలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. డోన్, ప్యాపిలి, ఆత్మకూరు, పాణ్యం మండలాల్లో జాయింట్ కలెక్టర్లు పరిశీలించారు.
► గుంటూరు జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పరిశీలించారు. కొల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.