ఈ–చలానాల పేరిట రూ.కోట్లు కొట్టేశారు | Huge fraud in collections of E Challana | Sakshi
Sakshi News home page

ఈ–చలానాల పేరిట రూ.కోట్లు కొట్టేశారు

Published Fri, Oct 20 2023 5:14 AM | Last Updated on Fri, Oct 20 2023 2:40 PM

Huge fraud in collections of E Challana - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు విధించే ఈ–చలానా వసూళ్లలో రూ.36.53 కోట్లను పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటనపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ–చలానా వసూలుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఒక క్లోన్‌ అకౌంట్‌ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించామని, సంబంధిత వ్యక్తుల అన్ని ఖాతాలు సీజ్‌ చేసి వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

ఇందులో గతంలో డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు అల్లుడు అవినాశ్‌ కొమ్మిరెడ్డి, అతని సోదరి అక్షిత, మరికొందరి పాత్ర ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి రాకుండా చేసిన ఈ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

రూపాయికే టెండర్‌ వేసి.. రూ.కోట్లు కొల్లగొట్టారు 
మోటారు వాహనాలపై విధించే చలానాల వసూలుకు సంబంధించి 2015 నుంచి ‘కృష్ణా సొల్యూషన్స్‌’ అనే సంస్థ కొన్ని జిల్లాల్లో సేవలు అందిస్తోందని ఐజీ పాలరాజు చెప్పారు. ఈ అప్లికేషన్‌ వాడుతున్నందుకు ప్రతి చెల్లింపుదారు నుంచి రూ.5 చొప్పున యూజర్‌ చార్జీగా ఆ సంస్థ వసూలు చేస్తోందన్నారు, 2017 జూన్‌లో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు ‘డేటా ఎవాన్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థ ఆధునికీకరించిన సాఫ్ట్‌వేర్‌ ఉందని, దీనిని కూడా ఉపయోగించమని సర్క్యులర్‌ ఇచ్చారని వివరించారు. దీంతో కృష్ణా సొల్యూషన్స్‌తో పాటు డేటా ఎవాన్‌ సొల్యూషన్స్‌ సేవలను కూడా వచ్చారన్నారు.

2018లో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి వాడుతుండటంతో అన్నిచోట్ల ఒకే పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో డేటా సొల్యూషన్స్‌ ఎంపిక కోసం ఓపెన్‌ టెండర్లు పిలిచామన్నారు. టెండర్‌ విలువ రూ.2 కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. ఈ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయన్నారు. కృష్ణా సొల్యూషన్స్‌ రూ.1.97 కోట్లకు టెండర్‌ వేయగా.. డేటా ఎవాన్‌ సొల్యూషన్స్‌ కేవలం ఒక్క రూపాయికే టెండర్‌ వేసిందన్నారు.

అదేమని అడగ్గా.. తాము ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సేవగా చేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని, మిగిలిన రాష్ట్రాల్లో వచ్చిన డబ్బులతో సంస్థను నడుపుతామని చెప్పడంతో డేటా ఎవాన్‌ సంస్థకే టెండర్‌ కేటాయించినట్టు వివరించారు.

అందరిపైనా కేసులు 
డేటా ఎవాన్‌ సొల్యూషన్‌తో పాటు రేజర్‌పీఈ అనే నకిలీ కంపెనీని సృష్టించి నగదు దారి మళ్లించిన వారందరిపైనా కేసులు నమోదు చేశామని ఐజీ తెలిపారు. తమ శాఖకు సాంకేతిక సహకారం అందిస్తున్న కొత్తపల్లి రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేశామని, అతని బినామీ ఆస్తులను గుర్తిస్తున్నామని చె­ప్పారు. కంపెనీ డైరెక్టర్లు కొమ్మిరెడ్డి అవినాష్, అక్షిత, రవికిరణ్‌తో పా­టు సాఫ్ట్‌వేర్‌ను ఎవరు నిర్వహించారో, ఎవరు సహకరించారో వారిని కూ­డా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తిచేసి బాధ్యులందరినీ అరెస్ట్‌ చేస్తామని పాలరాజు స్పష్టం చేశారు.

ఇలా కొట్టేశారు 
ఈ–చలానా అప్లికేషన్‌కు డబ్బులు వివిధ పేమెంట్‌ గేట్‌వేల ద్వారా వస్తాయని పాలరాజు చెప్పారు. పేటీఎం, ఏపీ ఆన్‌లైన్, మీసేవ, డెబిట్, క్రెడిట్‌ కార్డులు, వెబ్, రేజర్‌పే వంటి విధానాల్లో చలానా మొత్తాల చెల్లింపులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఇలా వచ్చిన డబ్బులన్నీ డీజీ అకౌంట్‌కు అనుసంధానం అవుతాయన్నారు. చెల్లింపులు జరుగుతున్న తరుణంలో కొంత అవకతవకలు జరుగుతున్నట్టు తిరుపతి యూనిట్‌లో గుర్తించారన్నారు.

ప్రతి రోజూ ఎంత వస్తుందన్నది డాష్‌బోర్డులో కనపడుతుందని, ప్రతినెలా 1వ తేదీన వసూలు చేసిన మొత్తం కొద్దిరోజుల తర్వాత చూస్తే తగ్గుతున్నట్టు గుర్తించడంతో విచారణ మొదలు పెట్టామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయడంతో పెద్దఎత్తున మోసం జరుగుతున్న విషయం వెలుగు చూసిందన్నారు. రేజర్‌పే ద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే ఖాతాకు మళ్లించుకున్నట్టు గుర్తించామన్నారు.

దీనికి సంబంధించి 2018లోనే ఒక క్లోనింగ్‌ ఖాతాను సృష్టించి.. దానిద్వారా డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. ఈ విధంగా పోలీసు శాఖకు రావాల్సిన రూ.36.53 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించి వాటిని సీజ్‌ చేశామన్నారు. ఏ  ఖాతాలకు మళ్లించారో ఆ ఖాతాల ద్వారా 2019 నుంచి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement