సాక్షి, అమరావతి: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, సెంచురీ ఫ్లైవుడ్స్ భజాంకా, శ్రీ సిమెంట్స్ బంగర్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూపు తూర్పు తీరప్రాంతంలో కీలకమైన కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుల్లో భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా సుమారు రూ.15,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తోంది. మరో కార్పొరేట్ దిగ్గజం బిర్లాలకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సంస్థ వైఎస్సార్ జిల్లా పులివెందులలో రూ.110 కోట్లతో గార్మెంట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా భలభద్రపురంలో రూ.2,700 కోట్లతో భారీ కాస్టిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణపట్నం వద్ద జిందాల్ గ్రూపు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ప్లై తొలుత రూ.600 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని చూసి పెట్టుబడులను రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక ప్రకటించడం పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. సన్‌ఫార్మా, శ్రీ సిమెంట్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.
రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
వచ్చే రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిపి సుమారు 70 భారీ పరిశ్రమలు యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 1,80,754 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే రూ.1.07 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఓఎన్‌జీసీ తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా హిందుస్థాన్ పెట్రోలియం విశాఖలో రూ.28,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.1,750 కోట్లతో జపాన్‌కు చెదిన ఏటీసీ టైర్స్, రూ.1,200 కోట్లతో కర్నూలులో రామ్‌కో సిమెంట్, రూ.1,404 కోట్లతో కాకినాడ జిల్లాలో శ్రావణ్ షిప్పింగ్ , రూ.2,000 కోట్లతో విశాఖలో సెయింట్ గోబియాన్ లాంటి భారీ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి.
ఇప్పటికే 92 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 92 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రభుత్వ సహకారంతో కియా మోటార్స్, కిసాన్ క్రాఫ్ట్, హీరో మోటార్స్, టీహెచ్‌కే ఇండియా, దివీస్ ఫార్మా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి 92 భారీ పరిశ్రమలు ఈ కాలంలో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చగా 56,681 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగాల్లో ఆటోమొబైల్, బల్క్ డ్రగ్స్, ఫార్మా, పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, ఫుడ్– మెరైన్ ప్రోడక్టŠస్ ఉన్నాయి.
పోర్టు ఆధారిత పెట్టుబడులపై దృష్టి
974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. కొత్తగా నాలుగు పోర్టులు నిర్మించడంతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. పరిశ్రమలకు అన్ని వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
– కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పెట్టుబడులకు అనువైన రాష్ట్రం
దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. కరోనా సమయంలోనూ బిర్లా, అదానీ, జిందాల్, సంఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేస్తాం.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment