తిరుపతి–హుబ్లీ మధ్య నడిచిన ఇంటర్‌సిటీ రైలు
రాజంపేట: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులకు తక్కువ ధరతో గమ్యాలను చేర్చే రైలుగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల ఆదరణ దక్కించుకుంది. అలాంటి రైలిప్పుడు జిల్లా ప్రయాణికులకు దూరమయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 57273/57274 నంబర్లతో కాకినాడ–తిరుపతి–హుబ్లీ (ఇంటర్‌సిటీ రైలు) ఉభయ జిల్లాల మీదుగా నడిచింది. అలాగే సీమవాసులు కోస్తా కారిడార్ ప్రయాణానికి ఈ రైలు అందుబాటులో ఉండేది. అన్ని వర్గాల ప్రజల ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రైలును ఫస్ట్‌వేవ్ కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ విషయాన్ని పట్టించుకోలేదు.
రెండు రాష్ట్రాల యాత్రికులకు సౌకర్యంగా..
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులకు సౌకర్యంగా ఈ రైలు నడిచింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తక్కువ ధరతో టికెట్ తీసుకొని ప్రయాణించే యాత్రికులపై రైల్వేబోర్డు శీతకన్ను వేసిందనే అపవాదును మూటకట్టుకుంది. సీమ జిల్లాలో పేద ప్రయాణికుల ఆదరణ పొందిన ఏకైక రైలు ఇంటర్‌సిటీ అని చెప్పుకోవచ్చు. ప్రజాసౌకర్యం కన్నా ఆదాయమే ప్రధానం అన్న విధంగా ఎన్‌డీఏ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్)
ఇంటర్ సిటీ దరిచేరని డెమో
రేణగుంట–గుంతకల్లు మధ్య నడుస్తున్న డెమో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెట్టిన ధరలతో పోలిస్తే ఇంటర్‌సిటీ మేలంటున్నారు ప్రయాణికులు. ఉదాహరణకు నందలూరు నుంచి కడపకు రూ.10నే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చార్జీతో డెమోను తీసుకొచ్చి రూ.30 తీసుకుంటున్నారు. ఒక వేళ రూ.30 టికెట్ తీసుకున్నా, స్టేషన్ నుంచి ఆటోకు రూ.20 కావడం మొత్తం మీద రూ.50 అవుతోంది. అలాంటప్పుడు బస్సులో వెళితే నేరుగా టౌన్‌లోకి వెళ్లవచ్చు కదా అనే భావనతో ప్రయాణికులు డెమో వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా..
ఇంటర్‌సిటీ రైలు 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా నడిచేది. నందలూరులో కూడా ఈ రైలు క్రూ ఛేంజింగ్ ఉండేది. రెండు రిజర్వేషన్ బోగీలు కూడా ఉండేవి. ఉభయ జిల్లాలకు చెందిన వారు అనేక మంది కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ కేంద్రం వరకు రాకపోకలు సాగించేవారు. రెండు రాష్ట్రాల మధ్య తక్కువ ధరతో గమ్యానికి చేరుకొనేవారు. అందువల్ల ఈ రైలు ఎప్పుడైనా రద్దీతో నడిచేది. ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగేది. అలాంటి రైలును ఇప్పుడు రైల్వేశాఖ కనుమరుగు చేసేలా తీసుకుంటున్న విధానాలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment