నాలుగు రోజులపాటు ప్రాజెక్టు పనులు పరిశీలన, సమీక్ష
సవాళ్లను అధిగమించే విధానం, డిజైన్లపై కసరత్తు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఎంపిక చేసిన అంతర్జాతీయ నిపుణులు యూఎస్‌ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన యాఫ్రి (స్వీడన్) ప్రతినిధులు ఆదివారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నాలుగు రోజులపాటు వారు అక్కడే మకాం వేసి, ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
ఆదివారం, సోమవారం ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని, డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లను పరిశీలిస్తారు. మంగళవారం, బుధవారం డయాఫ్రమ్‌వాల్ పనులు చేసిన బావర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్, ప్రాజెక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌స్) నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ సీఈవోతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే విధానాన్ని ఖరారు చేస్తారు. నిర్మాణాలకు డిజైన్లపై కసరత్తు చేస్తారు. నలుగురు అంతర్జాతీయ నిపుణులు, యాఫ్రి సంస్థ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ సభ్యులు (డిజైన్ అండ్ రీసెర్చ్ వింగ్) ఎస్కే సిబల్ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులకు పోలవరం ప్రాజెక్టు పనులపై అవగాహన కల్పించేందుకు పీపీఏ సీఈవో అతుల్‌జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రాజెక్టును పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్‌లు
పోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్‌ల బృందం శనివారం పరిశీలించింది. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనులను వీక్షించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటరమణ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ బృందంలో 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీలు సీహెచ్ కళ్యాణి, దామెర హిమ వంశీ, స్వప్నిల్ జగన్నాథ్, బొల్లిపల్లి వినూత్న, హెచ్‌ఎస్ భావన, శుభమ్ నోక్‌వాల్ ఉన్నారు. అనంతరం వీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment