జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌లు.. గ్రామాలకు క్రీడా పండుగ  | Jagananna Sports Clubs Under The Secretariats In AP | Sakshi
Sakshi News home page

Jagananna Sports Clubs: జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌లు.. గ్రామాలకు క్రీడా పండుగ 

Jun 10 2022 10:42 AM | Updated on Jun 10 2022 2:56 PM

Jagananna Sports Clubs Under The Secretariats In AP - Sakshi

ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్‌ ఏర్పాటు చేసుకునేలా.. మొత్తం గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతి స్పోర్ట్స్‌ క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, పాలకమండలి సభ్యులతో కార్యకలాపాలు సాగించేలా రూపకల్పన చేసింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్‌ చార్ట్‌ను కేటాయిస్తూ గురువారం మార్గదర్శకాలు (జీవోఆర్టీ నంబర్‌ 84, 85) విడుదల చేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో స్థానికంగా పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కో–ఆరి్డనేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) పర్యవేక్షణలో ఈ స్పోర్ట్స్‌ క్లబ్‌లను నిర్వహించనున్నారు.

పక్కా ప్రణాళికతో..
ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్‌ ఏర్పాటు చేసుకునేలా.. మొత్తం గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతి స్పోర్ట్స్‌ క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, పాలకమండలి సభ్యులతో కార్యకలాపాలు సాగించేలా రూపకల్పన చేసింది. మూడునెలలకు ఒకసారి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్‌ క్లబ్బులు పోటీలు నిర్వహించేలా మార్గదర్శకాల్లో పొందుపరిచింది. శాప్‌ అధికారులు స్పోర్ట్స్‌ క్లబ్బుల రిజిస్ట్రేషన్‌ను పక్కాగా ప్రత్యేక యా ప్‌ ద్వారా చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నారు. గ్రామాలతో పాటు  ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో కూడా స్పోర్ట్స్‌ క్లబ్బులు ఏర్పాటు చేస్తారు.

పంచాయతీ, మండల స్పోర్ట్స్‌ అథారిటీల పర్యవేక్షణ..
గ్రామాల్లోని స్పోర్ట్స్‌ క్లబ్బులను పంచాయతీ స్పోర్ట్స్‌ అథారిటీ (పీఎస్‌ఏ), మండల స్థాయిలో మండల స్పోర్ట్స్‌ అథారిటీ (ఎంఎస్‌ఏ) పర్యవేక్షిస్తాయి. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ ఈ క్లబ్బులు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. సర్పంచ్‌ చైర్మన్‌గా ఉండే పీఎస్‌ఏలో పంచాయతీ సెక్రటరీ, గ్రామానికి చెందిన జిల్లాస్థాయి క్రీడాకారుడు లేదా క్రీడాభివృద్ధికి ముందుకు వచ్చే దాత, స్థానిక హైసూ్కల్‌ పీఈటీ సభ్యులుగా ఉంటారు. ఎంపీపీ చైర్మన్‌గా ఉండే ఎంఎస్‌ఏలో తహసీల్దార్, ఎంఈవో, ఎస్‌ఐ, మండల ఇంజనీరు, ఎంపీడీవో, ఫిజికల్‌ డైరెక్టర్, ప్రిన్సిపల్‌/హెచ్‌ఎం, మండలం నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన పురుష, మహిళా క్రీడాకారులు (ఒక్కొక్కరు), స్వచ్ఛంద సేవకులు సభ్యులుగా ఉంటారు.

వీరు ఆయా గ్రామాలు, మండలాల్లో అవసరమైన క్రీడా వసతులు గుర్తించడంతోపాటు మరుగున పడిన స్థానిక యుద్ధ కళలను కూడా ప్రోత్సహించేలా శాప్‌తో కలిసి పని చేయనున్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేక క్రీడా పోటీలతో పాటు సీనియర్‌ సిటిజన్లకు రిక్రియేషన్, వాకింగ్, జాగింగ్‌ పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ అథారిటీలు ప్రతి నెలా సమావేశమై స్పోర్ట్స్‌ కాలెండర్‌ అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షించనున్నాయి. మండల, జిల్లా పరిషత్‌లు వాటి నిధుల్లో క్రీడలపై 4 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా అంతర్‌ గ్రామాల క్లబ్‌ల క్రీడలను నిర్వహించవచ్చు.

ప్రతిభ వెలుగులోకి వస్తుంది
విలేజ్‌ స్పోర్ట్స్‌ క్లబ్బులతో మారుమూల పల్లెల్లోని ప్రతిభగల క్రీడాకారులు త్వరగా వెలుగులోకి వస్తారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా వారిని తీర్చిదిద్దవచ్చు. గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల వారీగా స్పోర్ట్స్‌ కబ్బులను ప్రోత్సహిస్తున్నాం. వీటిద్వారా ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. పూర్తిస్థాయిలో క్రీడాక్లబ్బులు అందుబాటులోకి వస్తే గ్రామాల్లో నిత్యం క్రీడాపండుగ కనిపిస్తుంది.
– ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement