హజ్‌ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో  ముగియనున్న గడువు  | Jan 31 Last Date For Haj Yatra Applications | Sakshi
Sakshi News home page

హజ్‌ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో  ముగియనున్న గడువు 

Published Thu, Jan 20 2022 11:25 AM | Last Updated on Thu, Jan 20 2022 11:25 AM

Jan 31 Last Date For Haj Yatra Applications - Sakshi

అల్లిపురం (విశాఖ దక్షిణ): ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆ తర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్‌ (అంటే దాన ధర్మాలు). హజ్‌ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. దీనినే జీవిత సాఫల్య యాత్రగా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌ యాత్ర చేస్తారు. ఈ యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ముస్లింలు ఏటా హజ్‌ యాత్రకు వెళ్తుంటారు. హజ్‌ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఎంచుకుంటారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే హజ్‌ యాత్రికులకు విశాఖలోనే శిక్షణ ఇస్తారు.

చదవండి: యుద్ధ ప్రాతిపదికన డిజిటల్‌ లైబ్రరీలు

త్యాగానికి నిర్వచనంగా జరుపుకునే బక్రీదు పర్వదినం రోజున సౌదీ అరేబియాలోని పుణ్యస్థలం మక్కా ముకార్రమ్‌ ప్రదేశంలో కాబతుల్లా వద్ద హజ్‌ జరుగుతుంది. హజ్‌ పేరుతో వెళ్లే యాత్రికులు 40 రోజుల మక్కాతో పాటు ప్రవక్త హజరత్‌ మహమ్మద్‌ రసూలుల్లా(సాల్లెల్లాహు అలైహి వసల్లం) జన్మస్థలం మదీనా తదితర ప్రాంతాల్లో గడుపుతారు. నమాజులు, తవాఫ్, జికర్, దువా, ఖురాన్‌ పఠనం వంటి కార్యక్రమాలతో నిత్యం అల్లాను స్మరించుకోవడం, హజ్‌ జరిగే రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడమే ఈ యాత్ర ప్రత్యేకత. దైవ ప్రవక్తలు హజరత్‌ ఇబ్రహీమ్‌ ఖలీలుల్లా, హజరత్‌ ఇస్మాయిల్‌ జబీవుల్లా త్యాగాలకు ప్రతి రూపంగా ఏర్పడిన హజ్‌ ముస్లింలకు ఫరజ్‌ (తప్పనిసరిగా)గా మారిందని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది హజ్‌ యాత్రకు వెళుతుంటారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటివరకు 24 మంది దరఖాస్తు చేసుకున్నారని కమిటీ ప్రతినిధి రహమతుల్లా బెయిగ్‌ యాసీన్‌ తెలిపారు.

65 ఏళ్ల లోపు వారే అర్హులు.. 
గతంలో 75 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్‌–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయసు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయసు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. 

దరఖాస్తుల్లో రెండు విధాలు.. 
కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు  చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్‌’ అంటారు. కవర్‌లో కవర్‌హెడ్‌ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్‌లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు  వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయసు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్‌ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్‌లైన్‌ చేస్తారు. కవర్‌ నంబర్‌ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జనరేట్‌ చేస్తారు.

హజ్‌ యాత్రికులకు తోఫా  
హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తోఫా (బహుమతి) అందజేయనుంది. రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.60 వేలు, రూ.3 లక్షల పైన ఆదాయం కలిగిన వారికి రూ.30 వేలు తోఫా అందజేయనుంది.

అర్హతలు 
భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్‌ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్‌ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్‌ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్‌ రీడబుల్, ఇంటర్నేషన్‌ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్‌ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు.

రెండు కేటగిరీల్లో యాత్ర.. 
హజ్‌ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్‌ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పి స్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్‌ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్‌’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్‌ కుకింగ్‌ నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జోన్‌’ అని అర్థం.

వ్యాక్సినేషన్‌ తప్పనిసరి.. 
హజ్‌ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్‌ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్‌ కూడా పొందుపరచాల్సి ఉంటుంది.

31తో ముగియనున్న రిజిస్ట్రేషన్‌
హజ్‌ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 31లోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.300 చెల్లించాలి. దరఖాస్తులో ఒక్క గడి తప్పుగా పూరించినా హజ్‌ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్‌ హజ్‌ కమిటీ తరఫున హజ్‌ యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన హజ్‌ యాత్రికులు విశాఖపట్నం, ద్వారకానగర్‌లోని హజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ, డోరు నంబర్‌ 47–7–49, సుందర్‌ రెసిడెన్సీ, గ్రౌండ్‌ ఫ్లోర్, నెహ్రూ బజార్‌ ఎదురుగా, ద్వారకానగర్, విశాఖపట్నం–530016 చిరునామాలో గానీ 98481 95722, 93481 95722 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి విశాఖలోనే మూడు విడతలుగా, మూడు నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ యాత్రకు రూ.3,35,000 నుంచి రూ.4,07,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.

హజ్‌ దరఖాస్తుకు జత చేయాల్సినవి..
పూరించిన హజ్‌ దరఖాస్తుతో పాటు సెంట్రల్‌ హజ్‌ కమిటీ అకౌంట్‌పై బ్యాంక్‌లో (ఎస్‌బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్‌ నంబర్‌ కనిపించే విధంగా బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్‌ లేక రేషన్‌ కార్డు) కూడా జతపరచాలి.

వీరు అనర్హులు.. 
గర్భిణులు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుషు్ట, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. 

నామినీ.. 
హజ్‌ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి.

లక్కీ డ్రా.. 
దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్‌ హజ్‌ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరఫున హజ్‌ యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే 
హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్‌రాం అనే వ్రస్తాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్‌ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి.  ఇందుకు హజ్‌ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్‌ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. 
– కరీమ్‌ బేగ్, రిటైర్డ్‌ ఇంజినీర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు   

నియమాలు పాటించాలి 
హజ్‌ యాత్రకు వెళ్లే వారు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వలంటీర్లు చెప్పినట్లు నడుచుకోవాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకు యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ముందుగా హజ్‌ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తాం. అర్హులైన వారిని ఇక్కడ నుంచి హైదరాబాద్‌  హజ్‌ హౌస్‌కు పంపించి, అక్కడ నుంచి నేరుగా మక్కాకు విమానంలో పంపిస్తాం.  
– రహమతుల్లా బెయిగ్‌ యాసిన్,హజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ, విశాఖపట్నం

ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు  
ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్‌ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. చిన్నతనంలోనే రెండు పర్యాయాలు పవిత్ర హజ్‌ యాత్రకు వెళ్లి రావడం అదృష్టంగా భావిస్తున్నా. 
– సయ్యద్‌ నౌషద్‌ అలీ, పూర్ణామార్కెట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement