సాక్షి, సిటీబ్యూరో: 2023 హజ్ యాత్రకు దరఖాస్తుల ప్రక్రియ తీవ్ర అంతరాయాలతో కొనసాగుతోంది. దరఖాస్తులు అప్‌లోడ్‌కాక నానా తిప్పలు పడుతున్నారు. ఈ నెల 10న ఆన్‌లైన్ ద్వారా హజ్ యాత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రాంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర హజ్ కమిటీ సర్వర్ డౌన్ చూపుతుండడంతో దరఖాస్తులు అప్‌లోడ్ కావడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర హజ్ కమిటీ యాత్రికుల సౌకర్యార్థం హజ్ హౌస్‌లో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సర్వర్ డౌన్ ఉండడంతో ఒక్క అప్లికేషన్ కూడా అప్‌లోడ్ కాలేదు. 16వ తేదీ నుంచి దరఖాస్తులు అప్‌లోడవుతున్నా మధ్య మధ్యలో సర్వర్ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు దరఖాస్తు కోసం ఓటీపీ వస్తుంది. అయితే సమయానికి ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తు మధ్యలోనే ఆగిపోతుందని యాత్రికులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర హజ్ కమిటీలు సమన్వయంతో స్పందించి దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు. కాగా దీనిపై హజ్‌కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.
గతంలో దరఖాస్తులకు సంబంధించిన సర్వర్ నిర్వహణ కేంద్ర హజ్ కమిటీ ముంబయి అధీనంలో ఉండేదని, ప్రస్తుతం ఎన్‌ఐసీ డిల్లీ నిర్వహణలోకి మారిందని తెలిపారు. దరఖాస్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సర్వర్ డౌన్ సమస్య ఏర్పడిందని, కేంద్ర హజ్‌కమిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment