
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ సముద్రంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (ఈ నెల 15న) ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనంతరం ఇది ఈ నెల 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి.. 18వ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించి జవాద్ తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అల్పపీడన ప్రభావంతో ఈశాన్య గాలులు రాష్ట్రంపై కొనసాగుతుండటం వల్ల.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో కందుకూరులో 87.25 మి.మీ., దివ్వారిపాలెంలో 82.5, కదిరిలో 67.25, గండ్లపేటలో 58.75, పెనుకొండలో 58, నిమ్మనపల్లెలో 57.25, నల్లమడలో 54.25, బెస్తవారిపేటలో 49, రాచర్లలో 45.25, పులివెందులలో 45, నగరిలో 42 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.