![Ka Paul Reaction On EVM Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/15445.jpg.webp?itok=gb8p93MQ)
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
సీతమ్మధార: ఢిల్లీలో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో భారత ఎన్నికల కమిషన్ విఫలమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ.పాల్ ఆరోపించారు. ఆయన ఆశీలమెట్టలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఓడించడానికి బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల దుర్వినియోగాల గురించి వారం ముందు ఆప్ నాయకుడు, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను హెచ్చరించానని వెల్లడించారు.
జాతీయ రాజకీయాల్లో తన ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న ఏ రాజకీయ నాయకుడినైనా బీజేపీ లక్ష్యంగా చేసుకుని తొలగిస్తోందని హెచ్చరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సమగ్రతను కాపాడటానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కోరారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించినట్లయితే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 కంటే ఎక్కువ గెలుచుకోలేదన్నారు.
76 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. తనకు మద్దతిస్తే.. ఆట మొదలెడతానని అన్నారు. దేశంలో టాప్ 10 పొలిటికల్ పార్టీలు మోదీ ముందు లొంగిపోయాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు పూర్తిగా సందిగ్ధంలో ఉందన్నారు. ట్రంప్‌తో యుద్ధం చేసైనా తెలుగువాళ్లను కాపాడుకుంటానన్నారు. ఈ దేశానికి సేవ చేయడానికి రాజ్యసభ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తెలుగు సినిమాలు లేకపోతే.. హాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చెప్పిన సనాతన ధర్మం ఎక్కడుందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment