వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం | Karthika Brahmotsavams begin with grandeur | Sakshi
Sakshi News home page

వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Published Fri, Nov 29 2024 5:27 AM | Last Updated on Fri, Nov 29 2024 5:27 AM

Karthika Brahmotsavams begin with grandeur

రాత్రి చిన్నశేష వాహనంపై అమ్మవారి దర్శనం 

చంద్రగిరి: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా గురువారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. డిసెంబర్‌ 6 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీన్లోభాగంగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వార్, అమ్మవార్లతో పాటు గజచిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు.  ధ్వజస్తంభానికి తిరుమంజనం నిర్వహించారు. 

అనంతరం గజచిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణం చేయడంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం కనుల పండువగా నిర్వహించారు. సాయంత్రం విద్యుత్‌ కాంతుల నడుమ శ్రీవారి దేవేరికి ఊంజల్‌ సేవను వైభవంగా నిర్వహించారు. తదుపరి శ్రీవారి పట్టపురాణి రాత్రి 7 గంటలకు చిన్నశేష వాహనంపై ఆశీనులై నాలుగు మాడ వీధులతో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. 

వాహన సేవలో భాగంగా శుక్రవారం ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు.

తిరుమలకు చేరుకున్న సిట్‌ బృందం
తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సీబీఐ సిట్‌ బృందం గురువారం శ్రీవారి లడ్డూ తయారీ పోటుకు చేరుకుంది. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగం, పప్పు దినుసుల వినియోగం నాణ్యత తదితర వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకుంది. అయితే దీనిపై టీటీడీ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement