మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఊసేలేని బడ్జెట్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కే చంద్రబాబు తన ట్రాక్ రికార్డ్‌ను మరోసారి కొనసాగిస్తున్నారనే విషయాన్ని టీడీపీ కూటమి సోమవారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్ తేటతెల్లం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ద్వారా మరోసారి ప్రజలను సర్కారు వంచించింది. ఆ హామీని ఈ ఏడాదికి అటకెక్కించేసినట్టేనని తేల్చిచెప్పింది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఆ హామీపై మౌనవ్రతం పాటిస్తున్నారు. వచ్చే మార్చిలోగా అమలు చేస్తారేమో అనుకుంటే.. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉచిత ప్రయాణం పథకం ప్రస్తావనే లేకుండా చేశారు.
మహిళలకు ఈ ఏడాది రూ.3,500 కోట్ల నష్టం
ఉచిత బస్ ప్రయాణం పథకంపై ప్రభుత్వం దాటవేత వైఖరితో రాష్ట్రంలోని మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా. కేవలం మహిళల నుంచే టికెట్ల ద్వారా నెలకు రూ.350 కోట్ల రాబడి వస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రూ.350 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో మహిళలు బస్ ప్రయాణం రూపంలో ప్రతి నెలా రూ.350 కోట్లు నష్టపోతున్నారు. ఆ ప్రకారం ఇప్పటికే రాష్ట్ర మహిళలు రూ.1,750 కోట్లు నష్టపోయారు. ఏడాది మార్చి వరకు ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకం ప్రస్తావనే లేదు. అంటే కనీసం మరో 5 నెలలు మరో రూ.1,750 కోట్లు మహిళలు నష్టపోవడం ఖాయమని తేలిపోయింది. వెరసి 2024–24 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర మహిళలు రూ.3,500 కోట్లను రాష్ట్ర మహిళలు నష్టపోయినట్టే.
Comments
Please login to add a commentAdd a comment