జూదానికి ఖాకీల అండ
రోజు రూ. కోట్లలో చేతులు మారుతున్న డబ్బు
రూ. 5 లక్షలు ఉంటేనే ఆడేందుకు అనుమతి
రింగ్ లీడరు చాగలమర్రి మండల టీడీపీ నేత
ఒప్పందం చేసుకునే వచ్చిన పోలీస్ బాస్
రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి జూదరుల క్యూ
ఆళ్లగడ్డ: మళ్లీ బేరం కుదిరింది. పేకాట మొదలైంది. టీడీపీ నేతలు, పోలీసులు కలిసిపోయి జూదాన్ని జోరుగా నడిపిస్తున్నారు. రోజుకో చోట పేకాట శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అధికారులెవరూ అటు వైపు రాకూడదన్నది నిబంధన. ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినా స్థావరానికి రాకుండా డైవర్ట్ చేయాలి. ఇదీ.. పోలీసులు, పేకాట స్థావరాల నిర్వాహకుల మధ్య కుదిరిన డీల్. రెండున్నర నెలల తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పేకాట మాఫియా మళ్లీ జూలు విదిల్చింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా జూద శిబిరాలు నడిపించారు టీడీపీ నేతలు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న జిల్లా ఎస్పీ గట్టి చర్యలు తీసుకోవడంతో పేకాట శిబిరాలు ఆగిపోయాయి. ఇప్పుడు కొందరు పోలీసులతో ఒప్పందం కుదరడంతో మళ్లీ ‘ఆట’ మళ్లీ మొదలైంది. కొందరు పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే అన్నీ ఒప్పుకుని వచ్చినందున పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పేకాట శిబిరాల నిర్వహణలో ఘనుడైన చాగలమర్రి మండల టీడీపీ నేతే ఈ శిబిరాలకు రింగ్ లీడరన్న ప్రచారం ఉంది. ఆయన ఇటీవల ఓ పోలీస్ అధికారితో కలిసి చాగలమర్రి మండలంలో భారీగా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జూదాన్ని అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే ఈయనతో చేతులు కలిపి పేకాట ఆడిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో కోవెలకుంట్ల సర్కిల్‌లో పని చేస్తున్న సమయంలో కూడా ఆ పోలీసు అధికారి విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నిర్వహించి కోట్లు కూడబెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పేకాట శిబిరాలకు అనుమతించాలన్న ఒప్పందంతోనే ఆయన ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకున్నట్లు సమాచారం.
సాంకేతికత సాయంతో..
జూదరులకు ఏరోజు ఎక్కడ పేకాట అడించేదీ అరగంట ముందు చెబుతారు. ప్లేస్ నిర్ణయించి సెల్ ఫోన్‌లో లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్ ఇతరులకు షేర్ చేసేందుకు అవకాశం ఉండదు. వచ్చే దారిలోనే సెల్‌ఫోన్‌లు ఒక చోట భద్రంగా ఉంచుతారు. పోలీస్ స్టేషన్ నుంచి పేకాట శిబిరం వరకు 10 మంది కావలి ఉంటారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సమాచారం చేరవేసి శిబిరాన్ని ఖాళీ చేయిస్తారు. తర్వాత పోలీసులు రావడం, అక్కడ ఏమీ లేదని ఉన్నతాధికారులకు తెలియజేయడం నిత్యం జరిగే వ్యవహారం.
రోజుకు చేతులు మారుతున్నది రూ. 3 కోట్లు
నిన్నటి వరకు నియోజకవర్గం సరిహద్దు జిల్లాలోని అటవీ, వ్యవసాయ పొలాల వేదికగా కార్యకలాపాలు సాగించిన ఈ ముఠా ఇప్పుడు చాగలమర్రికి చుట్టు పక్కల ఖాళీ స్థలాలు, వ్యవసాయ బీడు భూములు, గని గుంతల్లో జూదం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా భారీగాజూదరులువస్తున్నారు. పేకాట శిబిరాల్లో జూదరులు ఆడేది అంతా అందర్‌బార్ (మంగపత్త).
ఈ జూదంలో రోజుకు కనీసం రూ. 3 కోట్లుచేతులు మారుతున్నట్లు సమాచారం. కోసు పడుచుకునే వ్యక్తి ఒక్కొక్కరు రూ. 5 వేలు చెల్లించాలి. కనీసం రూ. 5 లక్షలు జేబులో ఉండాలి. 30 నుంచి 50 మంది పాల్గొనే ఈ ఆటలో బరి కోసమే రూ 1.50 లక్షల నుంచి రూ 2.50 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment