
సాక్షి, విజయవాడ: ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక విద్య నుంచి ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి దార్శనికత, దూర దృష్టికి నిదర్శనమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మొఘల్రాజపురంలోని సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో "విద్య ఉపాధి అవకాశాలు - ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత" అంశంపై గురువారం నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే తరానికి ప్రపంచ వ్యాప్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే ఇంగ్లీషు మీడియం విద్యను సీఎం జగన్ ప్రోత్సహించారని ఆయన అన్నారు. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఉన్నత పదవుల్లో ఉన్నవారు, సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందినవారు పేద పిల్లలకు ప్రభుత్వం కల్పించే ఇంగ్లీషు మీడియం విద్యను వ్యతిరేకించడం తగదన్నారు. ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించడం అంటే, తెలుగు భాషకు ద్రోహం తలపెట్టినట్లు కాదనే విషయం ఈ వర్గం పెద్దలకు ఎందుకు బోధ పడడంలేదో తమకు అర్ధం కావడం లేదన్నారు. ఇంగ్లీషుకున్న ప్రాధాన్యత దృష్ట్యా చిన్న వయస్సు నుంచి నేర్చుకుంటే, ఆ భాషలో ప్రావీణ్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా పూలబాల వెంకట్ రచించిన "ఇండియన్ సోనెటీర్" అనే ఆంగ్ల పద్య సంపుటిని ఛైర్మన్ ఆవిష్కరించారు.
నవరత్నాలు అమలు, పర్యవేక్షణ కమిటీ వైస్ చైర్మన్ ఏ.ఎన్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇంగ్లిష్ ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానం భాష అన్నారు. ఇంగ్లిష్‌ని నేర్పించడం ద్వారా ఒక తరం బాగుపడేలా సీఎం జగన్ చేస్తోన్న ప్రయత్నాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం లేదన్నారు. అనంతపురానికి చెందిన "సత్య నాదెండ్ల", తమిళనాడుకు చెందిన "సుందర్ పిచాయ్" లు ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారంటే ఇంగ్లిష్ నేర్చుకున్నందువల్లనే అని ఆయన అన్నారు. అరుదైన ప్రజ్ఞతో, ఆంగ్ల కవిత్వ ప్రక్రియ "సోనెట్" ప్రయోగంతో పుస్తకాన్ని వెలువరించిన వెంకట్ పూలబాలను ఆయన అభినందించారు.
చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్
ప్రొ. ఎస్.ఏ. రహీమాన్ సాహెబ్ మాట్లాడుతూ,21 వ శతాబ్దంలో విద్యార్థుల భవిష్యత్తు ఆంగ్లంలో వారికివున్న ప్రావీణ్యంపై ఆధార పడుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెస్సర్‌గా తమకున్న 47 సంవత్సరాల బోధనా అనుభవంతో చెబుతన్నామని సమాజంలో ఆంగ్ల విద్య నేర్చుకోకపొతే, కూపస్థ మండూకంలా మిగిలిపోవడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలుగు భాష మన మనుగడకు ఎంత ఉపయోగ పడుతుందో, వృత్తికి, జీవనోపాధికి ఇంగ్లిష్ భాష అంత ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి తల్లి తొలి గురువని, పిల్లలు ఏభాషలో చదవాలనేది నిర్ణయించే అధికారం తల్లిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం హర్షించదగినదని ఆయన అన్నారు.
సీఆర్ మీడియా అకాడమీ సెక్రెటరి మామిళ్లపల్లి బాల గంగాధర తిలక్ మాట్లాడుతూ, భావాన్ని వ్యక్తీకరించేదే భాష అన్నారు. ఏ భాష నైనా ఇష్టంగా నేర్చుకోవడం ముఖ్యమన్నారు. కవిత్వాన్ని ప్రేమించేవారు భాషను తొందరగా నేర్చుకోగలరని తమ అధ్యాపకులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ స్థితిగతులను అందుకునేందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమన్నారు. పాఠశాల విద్యనుంచి ఇంగ్లిష్ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ఆంగ్లంలో కవిత్వం వ్రాయడం అంత సులువైనది కాదని ఆయన అన్నారు. "ఇండియన్ సానెటీర్" ఆంగ్ల కవితల రచయిత వెంకట్ పూలబాలను ఆయన అభినందించారు.
చదవండి: మేనిఫెస్టోనే మాయం చేశారు.. ఇక ఇప్పుడిచ్చే హామీలకు మిమ్మల్ని నమ్మేదెలా?
ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్. కృష్ణం రాజు మాట్లాడుతూ, పాత్రికేయులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా మీడియా అకాడమీ పనిచేయాలని కోరిన తొలితరం పాత్రికేయుల్లో తాము కూడా ఉన్నామన్నారు. పాత్రికేయలుకు పలు సామాజిక, సాంస్కృతిక అంశాల్లో సదస్సులు ఏర్పాటు చేసేందుకు తమ కార్యాలయాన్ని వేదికగా ఏర్పాటు చేస్తూ మంచి కార్యక్రమాల నిర్వహిస్తున్న చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అభినందించారు. ఇన్ని కార్యక్రమాలు విరామం లేకుండా చేపట్టడం కొమ్మినేనికి మాత్రమే సాధ్య మని ఆయన అన్నారు. సొనెట్ ఆంగ్ల కవిత్వ ధోరణి లో ఒక విశిష్ష్ట మైన ప్రక్రియ అని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో శ్రీ వెంకట్ పూలబాల రాణించారన్నారు. వారి ఇతర రచనలు సైతం తెలుగులో ఆదరణకు నోచుకున్నాయని ఆయన అన్నారు.
డా.వెంకట నారాయణ మాట్లాడుతూ వివిధ దేశాల్లో భారతీయులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం ఇంగ్లీష్ భాషలో వారికివున్న ప్రజ్ఞ వల్లనే అని అన్నారు. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అన్నారు.
అంజన మాట్లాడుతూ భాషను నేర్చుకోవడంతో పాటు, దైనందిన వ్యవహారాల్లో భాషను ఉపయోగించే తీరుతెన్నులు తెలిసి వుండాలన్నారు. వివిధ భాషలు నేర్చుకోవడం ఏంతో అవసరమని ఆమె సూచించారు.
"ఇండియన్ సానెటీర్" పుస్తక రచయిత పూలబాల వెంకట్ మాట్లాడుతూ, తాము రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావుకు కృతజ్ఞతలు చెప్పారు. 'సొనెట్' కు ఇంగ్లిష్ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం వుందన్నారు. 14 పంక్తులు కలిగి, అంత్యాను ప్రాసతో పద్యం నడవాల్సి వుంటుందన్నారు. ప్రతి ఆంగ్ల కవి 'సోనెట్' ప్రక్రియ ప్రయోగంలో తమ ప్రతిభ నిరూపించుకోవాలని తహతహ లాడుతారని ఆయన పేర్కొన్నారు.
'సోనెట్' కవితా వైభవంలో భావోద్రేకం (ఎమోషన్స్) ప్రధానంగా కనిపించే లక్షణమని ఆయన తెలిపారు. "భారత వర్ష" అనే పద్య గద్య కావ్యాన్ని తెలుగు లో రచించామని ఆయన చెప్పారు. అలవోకగా తెలుగు, ఇంగ్లిష్ పద్యాలను రాగయుక్తంగా ఆలపించి సభికులను ఆయన ఆశ్చర్య పరిచారు. అకాడమీ ఛైర్మన్ ఓఎస్.డి ఎస్. శ్రీనివాస జీవన్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో అకాడమీ ఎస్. ఓ.ఎం.ఎస్.ఎన్.రావు, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment