దంపుడు బియ్యానికి c/o కొండబారిడి | Kondabaridi Dampudu Biyyam Famous In Parvathipuram Manyam district | Sakshi
Sakshi News home page

దంపుడు బియ్యానికి c/o కొండబారిడి

Published Sun, Apr 24 2022 8:44 PM | Last Updated on Sun, Apr 24 2022 8:53 PM

Kondabaridi Dampudu Biyyam Famous In Parvathipuram Manyam district - Sakshi

దంపుడు బియ్యంలో పోషకాలు అధికం. ఆరోగ్యానికి మేలు. అందుకే మార్కెట్‌లో గిరాకీ ఉంది. నాణ్యమైన దంపుడు బియ్యం వినియోగించేందుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దీనినే ఓ మారుమూల గిరిజన గ్రామ మహిళలు ఆదాయవనరుగా మలచుకున్నారు. కొండ జక్కరతో సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని ‘జట్టు’గా రోకళ్లతో దంచి బియ్యంగా మార్చుతున్నారు. కిలోల చొప్పున ప్యాక్‌చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. గ్రామాన్ని దంపుడు బియ్యానికి కేరాఫ్‌గా మార్చిన కొండబారిడి గిరిజన గ్రామ మహిళల విజయగాథకు ‘సాక్షి’ అక్షర రూపం.   

కురుపాం(పార్వతిపురం మాన్యం): కొండబారిడి.. కురుపాం మండలానికి మారుమూలన ఉన్న చిన్న గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. వరిని సైతం అదే దారిలో పండిస్తున్నారు. ధాన్యాన్ని మరపట్టించాలంటే కొండపైనుంచి కిందకు దించాలి. వ్యయప్రయాసలకోర్చాలి. అందుకే.. ఏ ఇంటిలో చూసినా ఏ రోజు తిండిగింజలను ఆ రోజు రోకళ్లతో దంచి బియ్యంగా మార్చడం మహిళల దినచర్య. మరోవైపు దంపుడు బియ్యంతో ఆరోగ్యం సిద్ధిస్తోంది. వీటికి మార్కెట్‌లో గిరాకీ ఉంది. దీనిని కొందరు మహిళలు గుర్తించారు.

ఒక అడుగు ముందుకు వేశారు. ‘జట్టు’ సంస్థ సాయంతో 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని నిర్వహణలో అన్నపూర్ణ, శాంతి, ఏకలవ్య, శ్రీ కృష్ణ, శ్రీ భగవాన్, మిత్ర, సావిత్రి సంఘాలకు చెందిన మహిళలు భాగస్వాములయ్యారు. స్థానికంగా లభ్యమైన ధాన్యాన్ని దంచి దంపుడు బియ్యంగా మార్చుతున్నారు.

కిలో ప్యాకెట్లుగా మార్చి తెలంగాణాలోని హైదరాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు బీఎంపీఎస్‌ ట్రావెల్స్‌లో సరఫరా చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కొండబారిడి గ్రామం శతశాతం సేంద్రియ వ్యవసాయ గ్రామంగా ఎంపిక కావడం, అక్కడ పండే ధాన్యాన్ని దంపుడు బియ్యంగా మార్చి విక్రయిస్తుండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు.  


 దంపుడు బియ్యంతో బోలెడు ప్రయోజనాలు  
 దంపుడు బియ్యంలో గోధుమ రంగులో ఉండే సెలీనియం పెద్ద పేగుకు కేన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. 
► దంపుడు బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థలో ఉండే కేన్సర్‌ కారకాల రసాయానాలను బయటకు పంపుతూ పెద్ద పేగుకు కేన్సర్‌ రాకుండా కాపాడుతుంది. 
► గోధుమ రంగులో ఉండే పైటోన్యూట్రిన్స్‌ లిగ్నాట్‌ రొమ్ము కేన్సర్, గుండె జబ్బులను అడ్డుకునేందుకు సహాయ పడుతుంది. 
► వయస్సు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో దంపుడు బియ్యం (ముడి బియ్యం) తినడం వల్ల ఎంట్రోలాక్ట్స్‌ స్థాయి పెరిగి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె జబ్బులు దరిచేరవు.  
► దంపుడు బియ్యంలో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం 
     ఉండదు. శరీర బరువు సాధారణంగా ఉంటుంది. 
► ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం 21 శాతం వరకు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి.  
► రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్తం గడ్డకట్టకుండా ఉపయోగ పడుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. 
► గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్‌–2 డయాబెటీస్‌ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. 

ఆదాయం బాగు..  
2019లో ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా దంపుడు చేసిన 1000 కేజీల బియ్యంను కేజీ రూ.45 చొప్పున విక్రయించి  రూ.45,000 వేలు ఆదాయం ఆర్జించారు. 
2020–21 సంవత్సరాల్లో 2000 కేజీల బియ్యంను రూ.50 చొప్పున విక్రయించగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మూడున్నర సంవత్సరాలుగా లక్షా 35వేల పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం పొందినట్టు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. మార్కెట్‌లో గిరాకీకి తగ్గట్టుగా దంపుడు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

పోషకాలు మెండు  
ముడి బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పోలేట్‌ (పోలిక్‌ యాసిడ్‌), బి–విటమిన్‌లు శరీరానికి కొత్త కణాలను ఏర్పరచేందుకు సహాయపడతాయి. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి. బియ్యంలో అధికంగా ఉండే పీచుపదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
– ఎ. ప్రసన్నరాణి, కృషివిజ్ఞాన కేంద్రం, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, రస్తాకుంటుబాయి, కురుపాం మండలం  

తెలిసిన వ్యాపారం..  
బియ్యం దంచడం మాకు నిత్యకృత్యం. దంపుడు బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏడు సంఘాల మహిళలం ఏకమయ్యాం. ప్రతిరోజూ ధాన్యాన్ని దంచుతూ బియ్యం తయారు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యం కావడంతో డిమాండ్‌ పెరుగుతోంది. ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో రూ.65కు విక్రయిస్తున్నాం.  – పత్తిక సుశీల, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, కొండబారడి, కురుపాం మండలం  

కొండబారిడి గ్రామంలో ఉన్న సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement