ఆ వ్యాఖ్యలు స్టీల్‌ప్లాంట్‌పై జనసేన పార్టీ స్టాండా అని కార్మిక సంఘాల నిలదీత
వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక చీరేస్తామని అల్టిమేటం
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులను అవమానిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 1,314 రోజులుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
‘దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలవలేదని, వారిని చాచిపెట్టి కొట్టాల’న్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్టాండా? అని ప్రశ్నిస్తున్నారు. అదే వారి విధానమైతే తాము స్టీల్‌ప్లాంట్ కోసమే కాకుండా.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ఆ వ్యాఖ్యలు పట్టించుకోం
కార్మిక సంఘాల ఉద్యమాల వల్లే ప్రైవేటీకరణ ఇంతకాలం ఆగిందని బహిరంగ సభలో పవన్చెప్పారు. బొలిశెట్టి జనసేనలో ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. – డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ
క్షమాపణ చెప్పాలి
ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇది. ఏనాడూ బొలిశెట్టి కార్మికుల ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే టెంట్ వద్దకు వచ్చి ఆ మాట చెప్పాలి. – రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్‌టీయూసీ
సంఘాల వల్లే ప్రైవేటీకరణ ఆగింది
కార్మిక సంఘాలు ఉండబట్టే ఇప్పటివరకు ప్రైవేటీకరణ ఆగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఐటీయూ పోరాటాల వల్ల ఆగింది తప్ప.. పవన్‌కళ్యాణ్ వల్ల కాదు. ఈ విషయాలేవీ బొలిశెట్టికి తెలియదేమో. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ
విమర్శలు అర్థరహితం
స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన విమర్శలు అర్థరహితం. జనసేన అధికారంలోకి వచ్చాకే కార్మిక సంఘాలు మంచివి కావని ఆయనకు తెలిసిందా. – వై.మస్తానప్ప, ప్రధాన కార్యదర్శి, స్టీల్ వైఎస్సార్‌టీయూసీ
Comments
Please login to add a commentAdd a comment