ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు
అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు.. అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు
ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లం
కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులున్నాయి: విశాఖ ఎంపీ భరత్
ఏటా భారీ నష్టాలు.. ప్రైవేటీకరణ తప్పదు: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డుకోలేకపోతున్నానన్న పవన్ కళ్యాణ్
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా నోరు విప్పని వైనం
ఇప్పటికే ఆస్తుల విక్రయానికి టెండర్లను ఆహ్వానించిన ఆర్‌ఐఎన్‌ఎల్
అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’గా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఐదేళ్ల పాటు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ పోరాటం వృథా అవుతోంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూటర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న ఆ పార్టీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యమంటూ ఆంగ్ల మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం.
తొలుత ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్.. విశాఖ ఉక్కు విక్రయానికి టీడీపీ అనుకూలమని.. ఈ మేరకు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయంటూ కథనాన్ని ప్రచురించింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ సైతం ఇదే తరహాలో మరో కథనాన్ని అచ్చేసింది. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది.
మూడు రోజుల క్రితం విశాఖలో స్థానిక టీడీపీ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ తాము గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండటంతో చాలా ఇబ్బందులున్నాయని అసలు విషయాన్ని చెప్పేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఇబ్బందులు అంటూ రాగాలు తీయడంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను రూ.12,100 కోట్లకు టాటా గ్రూపు కొనుగోలు చేసి విస్తరణ చేపట్టింది. అదేవిధంగా విశాఖ స్టీల్‌ను భారీగా విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థకు కేంద్రం విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తాజాగా విశాఖ స్టీల్‌ను సందర్శించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఒక భారీ ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి లభిస్తుందంటూ టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
రంగం సిద్ధం..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు 10 శాతం, 20 శాతం షేర్లు డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మక అమ్మకం (స్ట్రాటజిక్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆరాటపడుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మడుగులొత్తుతోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కేంద్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది.
రూ.2,859 కోట్ల నష్టాల సాకుతో కేంద్రం స్టీల్‌ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించడానికి, దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రైవేటీకరణ చేస్తే తమకెలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ‘ప్రైవేట్ చేతికిస్తే పెట్టుబడులు పెరుగుతాయి కదా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ నగరాల్లో ఆస్తుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) టెండర్లను కూడా ఆహ్వానించడం గమనార్హం.
గనుల కేటాయింపులో వివక్ష వల్లే..
దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్షత చూపుతూ వస్తోంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయమవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సివస్తోంది.
దీంతో గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలను చవి చూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ గత ముప్‌పై ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యం
ఇటీవల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న శ్రీనివాసవర్మ అయితే ప్రైవేటీకరణ అనివార్యమని మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు భారీ నష్టాల్లో ఉందని, ప్రజాధనం వృథా కావడాన్ని తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. 7 మిలియన్ టన్నుల కంటే అత్యల్ప స్థాయిలో ఉత్పత్తి చేస్తూ గతేడాది రూ.2,859 కోట్ల నష్టాలను మూటకట్టుకుందన్నారు.
2011–12లో రూ.13,659 కోట్ల మూలధనం కలిగిన విశాఖ స్టీల్ ఇప్పుడు రూ.391 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో ప్రైవేటీకరణ తప్ప మరే మార్గం లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మంత్రుల పరిధిలో లేదని.. ప్రధాని నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడారు.
సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వాటిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితులపై అవగాహన కోసమే కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖ వచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రులిద్దరూ గురువారం స్టీల్ ప్లాంట్‌లోని పలు ఉత్పత్తి విభాగాలను సందర్శిస్తారు. అనంతరం ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమవుతారు.
పవన్ మౌనమేలా?
ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నేతలు ప్రైవేటీకరణకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు జారీ చేస్తున్నా మౌనంగా ఉండటంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ ఉన్నా ప్రైవేటీకరణను అడ్డుకునేవాడినని పవన్ గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన పార్టీకి పవన్‌తో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా మాట్లాడకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జనసేన ఎంపీలు ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయాలని 2021లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాలతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ఇవ్వడం ద్వారా ప్రైవేటీకరణను అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో టీడీపీ ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment