సాక్షి, అమరావతి: తొలి దశ కోవిడ్ సమయంలో ఇంటి వద్దే వైద్యం పొందిన వారిలో రెండో దశ కోవిడ్ ప్రభావం అంతగా కనిపించడం లేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లక తప్పని వారిలోనే రెండో దశ కోవిడ్ అనేక సమస్యలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మెడికల్ జర్నల్.. లాన్సెట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది మొదటి దశ కోవిడ్ సమయంలో స్వల్ప లక్షణాలున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రి బాట పట్టలేదు. ఇంటి వద్దే 14 రోజులు ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడి కోలుకున్నారు.
భారత్‌లాంటి దేశాల్లో ఇలా కోలుకున్నవారి రేటు ఎక్కువగానే ఉంది. అయితే.. కొంతమంది పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రులకు వెళ్లారు. అప్పుడప్పుడే కరోనాకు వైద్యం అందుబాటులోకి వస్తున్న సమయంలో తెలియకుండానే ఆస్పత్రులు ఇచ్చిన మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఆ తర్వాత యాంటీబాడీస్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయని లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది.
రెండో దశలో ప్రభావం
అధ్యయనంలో భాగంగా మన దేశంలో తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 8,983 మందిని, నెగిటివ్ వచ్చిన 80,893 మందిని పరిశీలించారు. వారందించిన వివరాలను బట్టి.. తొలి దశ కోవిడ్‌లో ఇంటి వద్ద చికిత్స పొంది.. రెండో దశలో కోవిడ్ బారిన పడిన వారిలో 91 శాతం మందికి నెగిటివ్ వచ్చాక పెద్దగా సమస్యలు లేవు. అయితే.. వీరిలో కొంతమంది రెండో దశలో వైద్య సేవలకు ఆస్పత్రులకు వెళ్లారు.
వీరికి భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక మొదటి దశలో ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎక్కువ మంది రెండో దశలో కోవిడ్ నెగిటివ్ వచ్చినా ఎక్కువగా మైగ్రేన్, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. స్వల్ప లక్షణాలుండి.. ఇంటి వద్దే మందులతో తగ్గే అవకాశం ఉంటే.. దానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని తాజా వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment