అల్లిపురం (విశాఖ దక్షిణం): వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు.. ఇంతలో ఏ కష్టమొచ్చిందో.. లాడ్జిలో విగతజీవులుగా మారారు. గదిలోని కిటికీకి ఉరేసుకుని తనువు చాలించారు. అయితే ఆత్మహత్యకు ముందు వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి మెడలోని తాళి ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్‌చార్జి సీఐ, మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం, దూసి గ్రామానికి చెందిన దామోదర్, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (18) సోమవారం గొల్లలపాలెందరి అయ్యన్ రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం వారి బంధువు లాడ్జికి వచ్చి వారి ఫొటో చూపించి ఏ గదిలో ఉన్నారో తెలుసుకున్నారు. రూమ్ దగ్గరకు వెళ్లి పిలిచినా, తలుపులు తట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన రాలేదు.
సుమారు గంటపాటు వేచి చూసిన తర్వాత వారు లాడ్జి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి చూసేటప్పటికి ప్రేమికులు ఇద్దరూ బాత్రూమ్‌లో కిటికీకి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో లాడ్జి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వారి గదిలో ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, కొన్ని పత్రాలు లభించగా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
రజక కులానికి చెందిన వీరిద్దరి మధ్య ఇటీవల పరిచయం పెరిగిందని, దామోదర్ కుల వృత్తి చేసుకుంటుంటుండగా, సంతోషి కుమారి నర్స్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయి మెడలో తాళి కనపడటంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ద్వారా ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు బుధవారం నగరానికి రానున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment